హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి సరిగా ఆదాయం లేదని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పే ప్రభుత్వ పెద్దలు.. కేంద్రం నిధులను ఎలా ఖర్చుపెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇందుకు సమగ్ర శిక్ష పథకమే ఉదాహరణ. ఈ పథకం నిర్వహణకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను కేటాయిస్తాయి. అయితే 2024 -25 విద్యాసంవత్సరానికి రూ.1,913 కోట్లకు ఆమోదం లభించింది. దీంట్లో కేంద్రం వాటా రూ.1,148.34 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ.765. 56కోట్లు. కేంద్రం ఇప్పటి వరకు మూడు ఇన్స్టాల్మెంట్ల నిధులను విడుదల చేసింది. మూడో ఇన్స్టాల్మెంట్ కింద కేంద్రం రూ.242 కోట్లను విడుదల చేయగా.. రాష్ట్రం తన వాటా కింద రూ.161 కోట్లను విడుదల చేయాలి. కానీ విడుదల చేయలేదు.
రాష్ట్ర ప్రభుత్వ తీరును పరిగణనలోకి తీసుకున్న కేంద్రం వచ్చే విద్యా సంవత్సరంలో కోత పెట్టింది. 2025-26కు సంబంధించి ఎస్ఎస్ఏ బడ్జెట్లో రూ.1,600 కోట్లకే ప్రతిపాదనలు ఉండాలని సీలింగ్ విధించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2024-25) రూ.1,913 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. వచ్చే విద్యా సంవత్సరంలో దీన్ని రూ.1,600 కోట్లకు కుదిస్తున్నది. ఈ లెక్కన రూ.300 కోట్ల వరకు కోత విధించినట్టే.