హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేద, బడుగు బలహీనవర్గాలని చూడకుండా ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఏడాది ట్యూషన్ ఫీజు మొత్తం ఒకేసారి కట్టమంటున్నాయి. ఫీజు కడితేనే ఫస్టియర్‌లో అడ్మిషన్ ఇస్తామంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలో మేం అడ్మిషన్ పొందాం.. మహాప్రభో అంటూ విద్యార్థులు మొత్తుకుంటుంటే ఫీజు లేదు.. రీయింబర్స్మెంట్ లేదు పొమ్మంటున్నాయి. రీయింబర్స్మెంట్ వస్తే మీవి.. మీరు తీసుకోండి అంటూ చెప్పేస్తున్నాయి. దీంతో డిగ్రీ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులకు కొత్త టెన్షన్ పట్టుకున్నది. ఒక్క ప్రైవేట్ కాలేజీలే కాకుండా.. చాకలి ఐలమ్మ వర్సిటీలోని కోఠి మహిళా కాలేజీ, నిజాం కాలేజీ, సైఫాబాద్ పీజీ కాలేజీల్లోనూ విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు ముందే వసూలు చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) మూడు విడతల సీట్ల భర్తీ పూర్తయ్యింది. 1.6లక్షల మంది ఈ సారి అడ్మిషన్లు పొందా రు. ఆదాయ ధ్రువీకరణ(రెండు లక్షల లోపు) ఉన్న వారు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరంలేదు. కేవలం ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. ఐదు వందల నుంచి రూ. వెయ్యి మాత్రమే చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే మొత్తం ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తున్నది. కానీ ఈ విద్యాసంవత్సరంలో కాలేజీలు తమ నిర్ణయాన్ని మా ర్చుకున్నాయి. విద్యార్థులు ఇలా కాలేజీలో అడుగుపెట్టగానే ఫీజులు కట్టాలంటున్నాయి. ముందు కడితేనే అడ్మిషన్లు తీసుకుంటామంటున్నాయి. ఫీజు కట్టకపోతే ఇవ్వలేమంటున్నాయి. కాలేజీల తీరుతో 95-96% మా ర్కులొచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులు అడ్మిషన్ల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. డిగ్రీ కాలేజీలకు సర్కారు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ రూ పంలో రూ. 850కోట్లు బకాయిపడింది. బకాయిలు విడుదల చేయాలని కాలేజీ యాజమాన్యాలు 40 రోజులపాటు సమ్మెకు దిగాయి. రెండుసార్లు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను సైతం బహిష్కరించాయి. అప్పటికప్పుడు హామీనిచ్చి ఆ తర్వాత సర్కారు ఈ విషయాన్ని విస్మరిస్తున్నది. దీంతో విద్యార్థుల నుంచి ఫీజలు వసూలు చేయాలని కాలేజీ యాజమాన్యాలు నిర్ణయించాయి.
ఇదీ పరిస్థితి
ఉన్నత విద్యామండలిని ముట్టడించిన ఏబీవీపీ
డిగ్రీ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు మొత్తం వసూలు చేయడాన్ని నిరసిస్తూ అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించింది. భారీగా తరలివచ్చిన విద్యార్థులు, ఏబీవీపీ నేతలంతా మాసాబ్‌ట్యాంక్‌లోని మండలి కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగరకార్యదర్శి పృథ్వీతేజ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడాన్ని ఉన్నత విద్యామండలి అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, దోస్త్ రిపోర్టింగ్ గడువును పొడిగించాలని కోరారు.