వేములవాడ, జనవరి 4: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ పెత్తనం చెలాయిస్తున్నది. కానుకల ఆదాయంతో చేపట్టే అభివృద్ధి పనులపై కొత్త నిబంధనలు పెట్టింది. రూ.10 లక్షలు దాటి చేపట్టే పనులకు సంబంధిత ప్రతిప్రతిపాదనలను ప్రభుత్వం ముందు పెట్టాల్సిందేనంటూ దేవాదాయ కమిషనర్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేసింది. సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
అభివృద్ధి పనులపై నిబంధన కత్తి
గతంలో భక్తుల సౌకర్యార్థం వేములవాడ, యాదాద్రి, భద్రాచలం లాంటి ఆలయాల్లో రూ.10లక్షల వరకు, కొండగట్టు, కొమురవెల్లి, బాసర ఆలయాల్లో రూ.2లక్షల వరకు చేసే అభివృద్ధి పనులకు కార్యనిర్వహణ అధికారి అనుమతి తీసుకునేవారు. అంతకు మించి చేపట్టనున్న పనులకు దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి, రూ.10 లక్షల పైన నుంచి మొదలుకొని రూ.వంద కోట్ల వరకు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో అభివృద్ధి పనులు చేపట్టేవారు. ప్రస్తుతం దేవాదాయశాఖ కమిషనర్ పరిమితిని ఎత్తివేసి, రూ.10లక్షలు దాటిన ప్రతిప్రతిపాదనను ప్రభుత్వ ముందుపెట్టాలని నిబంధనలు పెట్టారు.
ఈ మేరకు కమిషనర్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నిబంధనతో ఆలయాల్లోని అభివృద్ధి కుంటుపడనున్నది. ప్రధానంగా ఆలయాల్లో వేడుకలు, పండుగ, పర్వదినాల్లో చేపట్టే పనులు కూడా రూ.10లక్షలు దాటితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి నిబంధనలు ఆలయాల ఉద్యోగులకు గుదిబండగా మారనున్నాయి. కానుకలతో అభివృద్ధి పనులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతి పనికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయితే కమిషనర్ కార్యాలయం పరిధిలో అనేక పనుల ఒత్తిడి ఉంటున్నందున వాటిని ఎవరు ముందుకు తీసుకెళ్తారని ఆలయాలు ఉద్యోగులు చర్చించుకుం టున్నారు. నిబంధనలతో చేపట్టే పనులు సైతం వాయిదావేసే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.