BC Reservations | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంచుతాం’ ఇదీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. ఇప్పటిదాకా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు సైతం బీసీలకు నిర్దేశిత కోటా నిర్ణయించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఘంటాపథంగా చెప్పారు. అందుకే కులగణన చేపట్టామని సెలవిచ్చారు. కానీ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాజా ప్రకటనతో అయోమయం నెలకొన్నది. డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్న మంత్రి ప్రకటనతో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం మూలనపడినట్టేననే తేటతెల్లం అవుతున్నది. సంక్రాంతిలోగానే గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతాయని కూడా మంత్రి ప్రకటించారు. దీన్నిబట్టి కులగణనకు సంబంధం లేకుండానే ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నదనే అనుమానాలు నెలకొన్నాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే, పూర్వపు పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచానా వేస్తున్నారు.
కులగణన లేకుండానే ఎన్నికలు!
ఈ నెల 6 నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతుంది. సర్వే ఆధారంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన గడువును పరిగణనలోకి తీసుకున్నా జనవరి వరకు ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈలోగానే ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ కులగణన పూర్తయినా రిజర్వేషన్ల ఖరారుకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం నెలరోజులైనా పట్టవచ్చు. డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే కులగణనను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం ముందుకెళ్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆందోళనబాటలో బీసీ సంఘాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుంటే పోరాటం తప్పదని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమబాట పట్టారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసేదాకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. సర్కారు పెడచెవిన పెడితే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
రిజర్వేషన్లను ఎగ్గొట్టే కుట్ర
డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే పాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే ముందుకెళ్లాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఈ లెక్క ప్రకారం గత ప్రభుత్వం రిజర్వేషన్లకు నిర్దేశించిన పదేండ్ల గడువును యథావిధిగా కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. పాత పద్ధతిలోనే బీసీలకు 24 శాతం రిజర్వేషన్లను అమలు చేసి 42 శాతం కోటా హామీని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ ఓటరు జాబితాను సిద్ధం చేసింది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. కులగణన పూర్తికాకుండానే, బీసీలకు 42 శాతం కోటా లేకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నదని మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.