డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్లను అస్సలే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకున్నది. ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కారు.. పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్నే రూపొందించలేకపోయింది. హాల్టికెట్లలో తప్పులు దొర్లడం, ఒకే అభ్యర్థికి ఒకేరోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షల్లో, ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లుతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు.
DSC | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎక్కడి నిజామాబాద్.. ఎక్కడి మేడ్చల్.. దాదాపు 150 కిలోమీటర్లకు పైగా దూరం. 3 గంటలకు పైగా ప్రయాణం. ఆ అభ్యర్థి నివాసం ఉండేది కామారెడ్డి. ఒకేరోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మేడ్చల్‌లో ఒక పరీక్ష. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో పరీక్ష. ఉదయం పరీక్ష ముగించుకున్న వ్యక్తి మధ్యాహ్నం రెండు గంటల కల్లా 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలడా? పరీక్ష రాయగలడా? ఎలా సాధ్యం. మరో మహిళా అభ్యర్థికి ఉదయం మేడ్చల్‌లో, మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో పరీక్ష ఉన్నది. ఈ రెండింటి మధ్య సుమారు 150 కిలోమీటర్ల దూరం. ఇవేమీ చూడకుండా పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఎస్సీ పరీక్ష కేంద్రాలను ఇలా అస్తవ్యస్తంగా కేటాయించారు. ఈ నెల 18 నుంచి తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను గురువారం విద్యాశాఖ విడుదల చేసింది. ఎంతో ఉత్సాహంతో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను చూసి అవాక్కవ్వాల్సి వచ్చింది. అధికారులు స్పం దించి తమకు ఒకేచోట పరీక్ష కేంద్రాలను కేటాయించాలని బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
కే దామోదర్ అనే అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్), సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆయన స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్ష రాసేందుకు ఉదయం మేడ్చల్ కండ్లకోయ వద్ద గల సీఎమ్మార్ కాలేజీలో సెంటర్ కేటాయించారు. ఇదే అభ్యర్థికి మధ్యాహ్నం రెండు గంటలకు సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్ష కోసం నిజామాబాద్‌లో కేంద్రాన్ని కేటాయించారు.
ఉమ అనే అభ్యర్థి రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది. జూలై 20న ఒకే రోజు రెండు పేపర్లకు పరీక్ష జరగనున్నది. వనపర్తికి చెందిన ఈమెకు ఉదయం కండ్లకోయలోని సీఎమ్మార్ కాలేజీలో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష, మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లాలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష కోసం కేంద్రాన్ని కేటాయించారు. ఒకదానికి హాజరైతే మరో పరీక్షకు గైర్హాజరయ్యే ప్రమాదం ఉండటంతో ఉమ ఆందోళనలో ఉన్నది. పైగా 150 కిలోమీటర్లు ఒకే రోజు ప్రయాణించాల్సి ఉండటంతో దీని ప్రభావం పరీక్షపై పడుతుందని కలవరపడుతున్నది.
మరో అభ్యర్థి రెండు పేపర్లకు దరఖాస్తు చేయగా, ఒక హాల్‌టికెట్‌పై ఫొటో ముద్రించగా, మరో హాల్‌టికెట్‌పై ఫొటోను ముద్రించలేదు. ఇదేం పరీక్ష.. ఇదేం పద్ధతి అంటూ ఆ అభ్యర్థి ప్రశ్నిస్తున్నాడు.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ (గణితం) ఉద్యోగానికి ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకుప్రయత్నించగా మీ వివరాలు లభ్యంకావడం లేదని వెల్లడించగా, ఖంగుతినడం ఆ అభ్యర్థి వంతయ్యింది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, 24 గంటల తర్వాత ఎట్టకేలకు శుక్రవారం రాత్రి అధికారులు హాల్‌టికెట్‌ను జారీచేశారు.
డీఎస్సీ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి తప్పుల మీద తప్పులు చేస్తున్నది. పరీక్షల నిర్వహణలో తొలుతే ఈ వైఫల్యానికి దారితీసిడంపై అనుమానాలకు తావిస్తున్నది. డీఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా పట్టుదలకుపోయి అసలు విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నది. కీలకమైన విద్యాశాఖకు రాష్ట్రంలో మంత్రి లేకపోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీ.. వివిధ అదనపు బాధ్యతల్లో ఉండటంతో సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు. డీఎస్సీ హాల్‌టికెట్ల జారీలోనూ జాప్యం జరిగింది. గురువారం సాయం త్రం 5 గంటలకే హాల్‌టికెట్లు జారీకావాల్సి ఉం డగా, రాత్రి 7 గంటల తర్వాత విడుదల చేశారు. తీరా పలువురి హాల్‌టికెట్లు తప్పుల తడకగా ఉండటం అభ్యర్థులను కలవరపెడుతున్నది.