హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మంజూరైన కొత్త జవహర్ నవోదయ విద్యాయాల (జేఎన్వీ) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నవోదయకు కావాల్సిన స్థలాల కేటాయింపు పూర్తిచేయడం లేదు. ఫలితంగా మూడు జేఎన్వీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంగారెడ్డి, మే డ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాలు స్థల సేకరణ పూర్తికాని వాటిలో ఉన్నాయి. దీంట్లో సీఎం సొంత జిల్లా పాలమూరు ఉండటం గమనార్హం. ఈ మూడు పాఠశాలలకు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేయలేదు. రాష్ర్టానికి ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరైన విషయం తెలిసిందే. అయితే వీటి ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగింది. దీనిపై జూన్ 2న ‘నమస్తే తెలంగాణ’లో ‘నవోదయ.. ఈసారి అడ్మిషన్ లేదయా’ శీర్షికతో కథనం ప్రచురితమైంది.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా రాష్ట్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలైలోపు ఈ ఏడు నవోదయ పాఠశాలలను అందుబాటులోకి తీసుకొచ్చి, అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించారు. తాత్కాలిక క్యాంపస్‌లో వీటి ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. నవోదయ విద్యాలయాల కోసం తొలుత స్థల కేటాయింపును పూర్తిచేసి, ఆ తర్వాత తాత్కాలిక క్యాంపస్‌లో కొత్త జేఎన్వీలను ప్రారంభించాలని కేంద్రం షరతు విధించింది. ఏడు నవోదయ విద్యాలయాల్లో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలలో మాత్రమే స్థల సేకరణ పూర్తయింది. సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్‌లలో స్థల కేటాయింపు పూర్తికాలేదు. దీంతో వాటికి కేంద్రం తుది అనుమతులివ్వలేదు. దీంతో అడ్మిషన్లకు బ్రేక్‌పడింది.