హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయంజాల్ గ్రామంలో 1521.13 ఎకరాలు శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి చెందినవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ వివరాలను మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ రికార్డుల్లో నమోదు చేశారు. సర్వే నంబర్ 688 నుంచి 712, 716ల్లోని ఆలయ భూములను సీసీఎల్ఏ నిషేధిత జాబితాలో చేరుస్తూ 2014లో జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ 300కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కే మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. తామే భూ యజమానులమని చెప్పుకుంటున్న పిటిషనర్లు ఆధారాలు చూపడం లేదని అన్నారు. పిటిషనర్ల వాదనల నిమిత్తం తదుపరి విచారణ వాయిదా పడింది.