హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆకలితీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని (CM Breakfast Scheme) పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి కాకుండా, వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ 12 నుంచి ఈ పథకాన్ని పునఃప్రారంభించనున్నది. ఈ పథకం అమలుకు నిధులు సమకూర్చాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్కీమ్ అమలుకు అనుమతించాలని కోరింది. ఒక్కో విద్యార్థికి ఉదయం అల్పాహారం సమకూర్చేందుకు సగటున రోజుకు రూ.8 నుంచి రూ.12 వరకు ఖర్చవుతుందని అంచనావేసింది. వారంలో మూడు రోజులు రైస్ (పొంగలి, కిచిడీ వంటివి) రెండు రోజులు ఉప్మా, మరో రోజు ఇడ్లీ/బోండా వంటి వాటిని అల్పాహారంగా అందించే యోచనలో అధికారులున్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలుచేస్తారు.
అధికారంలోకి వచ్చాక బంద్ పెట్టి..
సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో ప్రారంభించింది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయాలని సంకల్పించింది. ఇందుకోసం రూ.672 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది. తొలుత నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున 119 స్కూళ్లల్లో ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత మండలానికి ఒక స్కూల్ చొప్పున విస్తరించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని 3,500 స్కూళ్లల్లో ఈ పథకం అమలైంది. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని బంద్పెట్టింది. బడ్జెట్ కేటాయించకపోవడం, నిధులు మంజూరుచేయకపోవడంతో ఈ పథకం ఆగిపోయింది.
సిలిండర్ కనెక్షన్
రాష్ట్రంలోని సర్కారు బడులకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు సమకూర్చాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఒక్కో కనెక్షన్‌కు రూ.రెండు వేలకుపైగా డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చాలని నివేదించింది. అయితే, సిలిండర్ ధరను మధ్యాహ్న భోజన ఏజెన్సీలే చెల్లించాల్సి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ తయారుచేసినందుకు మధ్యాహ్న భోజనం వంట కార్మికుల
పారితోషికాన్ని రూ.500 పెంచాలని కూడా ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండగా, గతంలో వంట కార్మికుల పారితోషికం వెయ్యి రూపాయలుండగా, గత కేసీఆర్ ప్రభుత్వం రూ.మూడువేలకు పెంచింది.