రాష్ట్రవ్యాప్తంగా పత్తిపంట చేతికొచ్చే సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోళ్లు జరుగక ఒకచోట, వర్షాల కారణంగా తడిసి పరిహారం అందక మరోచోట రైతులు అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు సాగు చేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేయడంతో గిరిజన రైతులు భగ్గుమన్నారు. అధికారుల తీరును నిరసించారు.
కాశీబుగ్గ, నవంబర్ 5 : పత్తి వ్యాపారుల బెదిరింపుతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. గురువారం నుంచి చేపట్టే నిరవధిక బంద్‌ను వాయిదా వేసుకోవాలని సర్కార్ విజ్ఞప్తి చేసింది. కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ తెలిపారు. నిరవధికంగా పత్తి కొనుగోళ్ల బంద్‌ను వాయిదా వేసుకోవాలని, సమస్యలు వెంటనే పరిష్కరించేదుకు కృషి చేస్తామని కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డిని కోరారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని, బిహార్ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున తొందర్లోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపినట్టు బొమినేని రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీసీఐ బ్రాంచి మేనేజర్లు రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడు రోజుల్లో సీసీఐ కేంద్రాలను 75 శాతం తెరిచి ఉంచుతారని, మిగతావి కేంద్ర మంత్రి ఆదేశానుసారం తప్పకుండా ఓపెన్ చేస్తామని తెలిపినట్టు రవీందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ సూచన మేరకు పత్తి కొనుగోళ్ల బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ బంద్‌కు వెళ్లాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
చండ్రుగొండ, నవంబర్ 5 : పోడు భూముల్లో గిరిజనులు సాగు చేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది. రావికంపాడు పంచాయతీ పరిధిలోని పోడు భూముల్లో కొందరు గిరిజనులు పత్తి సాగు చేశారు. మంగళవారం సాయంత్రం దాదాపు వంద మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది వచ్చి.. గుగులోత్ వాలి, తేజావత్ సరోజ సాగు చేసిన సుమారు ఐదు ఎకరాల పత్తి పంటను ధ్వంసం చేశారు. పంట భూముల వద్దకు బుధవారం ఉదయం చేరుకున్న గిరిజనులు అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేసిన పంటను చూసి విలపించారు.

అధికారుల తీరును నిరసిస్తూ పత్తి మొక్కలతో గ్రామంలో నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్య తీసుకోవాలని రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. అటవీ శాఖకు చెందిన భూముల జోలికి వెళ్లొద్దని గతంలో పలుమార్లు అటవీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో గిరిజనులకు కౌన్సెలింగ్ ఇచ్చామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎల్లయ్య తెలిపారు. అయినా వారు పోడు సాగు మానుకోలేదని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఊట్కూర్, నవంబర్ 5: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి ఎకరాకు రూ.30 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా బిజ్వారంలో సామాజిక కార్యకర్త నర్సింహ దీక్ష చేపట్టారు. వరి, మక్కకు సైతం పరిహారం ప్రకటించాలని, 20 శాతం తేమతో పత్తి, వరిని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలని విజ్ఞప్తి చేశారు. సీసీఐ నిబంధనలు సవరించి ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.