హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు తమ అనుమతి అవసరంలేదని తెలిపింది. గత ప్రభుత్వ హయాం లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లలో కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన లేదని గుర్తుచేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన లేదని, కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని పేరొంది. గత పాలనలో రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా పరిగణించి హైకోర్టు విచారణ చేపట్టింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపించారు. ‘కేంద్ర టెలికమ్యూనికేషన్ చట్టం-23 జూన్ 2021 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన నిబంధనల రూపకల్పన జరగలేదు. కాబట్టి ప్రస్తుతం టెలిగ్రాఫ్ నిబంధనలే అమల్లో ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్‌కు పాల్చడితే మూడేండ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2 కోట్ల జరిమానా లేదా రెండూ కలిపి విధించవచ్చు.
ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చో టెలిగ్రాఫిక్ చట్ట నిబంధనల్లో ఉంది. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు జారీచేయవచ్చు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వస్తున్నదో కారణాలు రికార్డుల్లో నమోదు చేయాలి. ఈ ఉత్తర్వులను సమీక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా రివ్యూ కమిటీలు ఉంటాయి. ఈ కమిటీ వాటిని ధ్రువీకరించాలి. ట్యాపింగ్ ఉత్తర్వులు 60 రోజుల వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ పొడిగించేందుకు వెసులుబాటు ఉంది. గరిష్ఠంగా 180 రోజుల వరకు అనుమతి ఉంటుంది. వీటికి చెందిన రికార్డులను ఆరు మాసాల్లో ధ్వంసం చేయవచ్చు’ అని కేంద్రం కౌంటర్ పిటిషన్లో పేరొంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారమే కౌంటర్ దాఖలు చేసినట్టు చెప్పింది. దీంతో తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.