KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం పార్టీ కీలక సమావేశం జరగనున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు సమావేశానికి హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వ ర్ జూబ్లీ వేడుకల నిర్వహణతోపాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నట్టు వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది. అయితే, బహిరంగసభను ఈ నెలలో నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవంనాడు నిర్వహించాలా? లేదా పార్టీ అధ్య క్ష ఎన్నిక ఉన్న సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించా లా? అనే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. ఏప్రిల్ 27న ప్రతినిధుల సభను నిర్వహించి, అప్పటినుంచి అధ్యక్ష ఎన్నిక నాటికి పార్టీ సభ్యత్వ నమో దు, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల ని ర్వహణ, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో అధ్యక్ష ఎన్నిక నిర్వహణ తదితర అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ కోసమే ఆర్భివించిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ తన సుదీర్ఘ ప్రయాణంలో నాలుగుకోట్ల ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నది. 14 ఏండ్లు పోరాటం చేసి, అనేక ఉద్యమాలు చేసి రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలతో పేగుబంధాన్ని పెనవేసుకున్నది. ‘తెలంగాణ సంతోషమే బీఆర్ఎస్ సంతోషం. తెలంగాణ బాధే బీఆర్ఎస్ బాధ’గా కొనసాగుతున్న సందర్భంలో ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యం నెలకొన్నది. తెలంగాణ సాధనలో ఉద్య మ మరపురాని అనుభూతులను ఈ తరానికి చేరవేయడం, తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బీఆర్ఎస్ తన పదేండ్ల పరిపాలనలో అటు అభివృద్ధిలో, ఇటు ప్రజా సంక్షేమంలో చెరగని సంతకం చేసిన కేసీఆర్ ఖ్యాతిని ప్రతి ఒక్కరికీ చేరేలా కార్యాచరణ రూ పొందించుకోవాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ కోసం ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ వెంట 60 లక్షల సుశిక్షితులైన సైన్యం ఉన్నది. ఆ సైన్యం గర్జన ఏ స్థాయిలో ఉంటుందో 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో చవిచూసినట్టే ఏడాది కాలంగా కాంగ్రెస్ చవిచూస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. కేసీఆర్ నాయకత్వాన్ని జారవిడచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి పట్టాలు తప్పి కకావికలం అవుతున్న సందర్భం నెలకొన్నది. రైతులు, మహిళలు, వృద్ధులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం, కార్మికులు ఇలా సబ్బండ వర్గాలు మళ్లీ బీఆర్ఎస్ గొడుగు కోసం ఎదురుచూస్తున్న వాతావరణం నెలకొన్నది. ఇటువంటి తరుణంలో కేసీఆర్ ‘ఏం చెప్తారు?’ అని ప్రజల్లో ఆసక్తి నెలకొనగా, రాజకీయ నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద నేటి విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వైఫల్యాల ను ఎండగట్టేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించి పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇచ్చి న హామీలను సాధించుకుంటూ, తమ హకులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై ఈ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామనే వేలంవెర్రి వ్యూహంతో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజావ్యతిరేకతను చవిచూస్తున్నది. రేవంత్ సర్కార్ వేస్తున్న తప్పటడుగులు యా వత్ తెలంగాణ భవితకు, ప్రతిష్ఠకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ ఎక్కడిక్కడ ఎండగట్టడంలో, నిలువరించడంలో అనేక విజయాలను సాధించింది. రైతు రుణమాఫీని సాధించటం లో (ఇంకా పూర్తిస్థాయిలో రైతులందరికీ మాఫీ కాకపోయినా), రైతుభరోసా కనీసంగానైనా మొదలుపెట్టడంలో, నేలవిడిచి సాముచేస్తున్న హైడ్రాకు ముకుతాడు వేయడంలో, అమాయక గిరిజన రైతుల భూ ములను లాక్కోని సర్కార్ సృష్టించిన లగచర్ల అరాచకాన్ని నిలువరించడంలో, ఢిల్లీ దాకా వెళ్లి లగచర్ల విషయంలో సర్కార్ వైఖరిని ఎండగట్టడంలో, గురుకుల విద్యార్థుల డైట్చార్జీల పెంపు.. ఇలా అనేక విషయాల్లో రేవంత్ సర్కార్‌ను బీఆర్ఎస్ భూమార్గం పట్టించింది. ఆఖరికి బీసీ కులగణన విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ రీసర్వే (సర్వేలో భాగం కానివారిని చేస్తామని) ప్రకటించేదాకా నిత్యం ప్రజల్లోనే ఉంటూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ రాజీలేనిపోరాటం చేస్తున్నది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఇంటిపార్టీ.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ గుండెచప్పుడు గులాబీదండు అని గడచిన ఈ 14 నెలల కాలంగా నిరూపితం అవుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రూ.2 లక్షల రైతు రుణమాఫీని (ఇంకా పూర్తిస్థాయిలో రైతులందరికీ పూర్తి మాఫీ కాకపోయినా) అమలు చేయక తప్పని అనివార్యతను బీఆర్ఎస్ సృష్టించింది.
రైతుభరోసాను ప్రభుత్వం మొదలు పెట్టేలా చేసింది.
హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలవటంతో ముచ్చెమటలు పట్టి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి సర్కార్ వెళ్లింది.
లగచర్ల భూ నిర్వాసితుల పట్ల రేవంత్ సర్కార్ విధానాలను ఎండగట్టేందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరుబాట. బాధితులకు అండగా నిలిచేందుకు జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ దాకా వెళ్లి రేవంత్ సర్కార్ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై అలుపెరుగని పోరాటం.
గురుకులాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో విద్యార్థుల అస్వస్థతకు గురికావడం, కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ చేపట్టిన ‘గురుకులబాట’తో సర్కార్ దిగొచ్చి మెస్‌చార్జీలను పెంచటం.
రైతు ఆత్మహత్యలపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ, గురుకులాల దుస్థితిపై ఆర్ఎస్ ప్రవీణ్ నేతృత్వంలో కమిటీ, గాంధీ దవాఖాన సహా రాష్ట్రంలోని ఆధ్వాన్న వైద్య స్థితిగతులపై మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య సారధ్యంలో కమిటీ, ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలపై పార్టీ కార్మిక విభాగం అధ్యర్యంలో కమిటీ.. ఇలా ఏ వర్గం ఆపదలో ఉంటే ఆ వర్గానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ అధ్యయన కమిటీలు వేయడంతో అనేక అంశాల్లో కాంగ్రెస్ సర్కార్‌కు ముక్కుతాడు వేసింది.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సోషల్‌మీడియా కార్యకర్తలే టార్గెట్‌గా వందల కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసినా మొక్కవోని పట్టుదలతో గులాబీ శ్రేణులు ఈ 14 నెలల కాలంలో ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు.