పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ చూడని ఆర్థిక పతనం ఇప్పుడు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్యంతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయి రాష్ట్రంలో ద్రవ్య చలామణి పూర్తిగా స్తంభించిపోయింది. దీన్ని ధ్రువపరుస్తూ అక్టోబర్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరోసారి డిఫ్లేషన్ దశలోకి పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. గడిచిన ఐదు నెలల వ్యవధిలో ఏకంగా నాలుగుసార్లు రాష్ట్రం డిఫ్లేషన్‌లోకి జారుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంతమాత్రం మంచిదికాదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ (Telangana). జీఎస్డీపీ (GST) వృద్ధిరేటులో పెద్ద రాష్ర్టాలను తోసిరాజని అగ్రస్థానంలోకి చేరిన తెలంగాణ.. ఇవన్నీ గతం. కేసీఆర్ (KCR) పాలనలో చూసిన వైభవం. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో ఓ విఫల రాష్ట్రంగా మారిపోతున్నది. అక్టోబర్‌లో రాష్ట్ర ఆర్థికం మరోసారి ‘డిఫ్లేషన్’ (నెగటివ్ ఇన్ఫ్లేషన్-ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఐదు నెలల వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా నాలుగోసారి ప్రతి ద్రవ్యోల్బణం నమోదవడంపై ఆర్థిక నిపుణులు ఆం దోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో అక్టోబర్‌లో ప్రతి ద్ర వ్యోల్బణం మైనస్ 1.16%గా నమోదైంది. అదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 0.25%గా రికార్డయింది. తెలంగాణ ఏర్పడిన పదకొండున్నరేండ్ల తర్వాత జూన్ లో తొలిసారిగా డిఫ్లేషన్ -0.93%గా రికార్డయింది. జూలైలోనూ డిప్లేషన్ -0.44%గా నమోదైంది. సెప్టెంబర్‌లో మళ్లీ -0.15% గా నమోదైంది. ఇప్పుడు అక్టోబర్‌లో డిఫ్లేషన్ ఏకంగా -1.16%గా నమోదైంది.
డిఫ్లేషన్ మంచిది కాదు
రాష్ట్ర లేదా దేశ ఆర్థిక వ్యవస్థకు డిఫ్లేషన్ అనేది డేంజన్ బెల్ లాంటిదని నిపుణులు చెప్తారు. అందుకే ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ద్రవ్యోల్బణ వృద్ధిరేటు 2-6 శాతం మధ్యలో ఉండాలని రిజర్వ్‌బ్యాంకు లక్ష్యంగా పెట్టుకొన్నది. డిఫ్లేషన్ కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి వ్యాపారాలు దెబ్బతింటాయని, ఇది ఉపాధి అవకాశాలను గల్లంతు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.
డిఫ్లేషన్ అంటే ఏమిటి?
ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు సమయానుకూలంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తారు. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగితే వస్తువులు, సేవల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం తగ్గితే వాటి ధరలు తగ్గుతాయి. అయితే, ఇదంతా ఒక పరిధికి లోబడే ఉంటుంది. ఆర్బీఐ పేర్కొన్నట్టు ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ద్రవ్యోల్బణ వృద్ధిరేటు 2-6 శాతం మధ్యలో ఉండాలి. అయితే, ఎప్పుడైతే ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్తే అది డిఫ్లేషన్‌కు కారణమవుతుంది. నెగటివ్ ఇన్ఫ్లేషన్ లేదా డిఫ్లేషన్ నమోదు చేసిన రాష్ట్రంలో ధరలు తగ్గడం అటుంచితే వస్తు, సేవలను వినియోగించుకొనే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రమాదకరం. అక్టోబర్‌లో తెలంగాణ మైనస్ 1.16 డిఫ్లేషన్ను నమోదు చేసింది. ఇది ఆర్బీఐ కనిష్ఠ పరిమితి కంటే 3.16 పాయింట్లు తక్కువ.
డిఫ్లేషన్ను ఎలా గుర్తించవచ్చు?
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, కూరగాయలు, నిత్యావసరాలు, స్కూల్, కాలేజీ ఫీజులు.. ఇలా అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. అయితే, ద్రవ్యోల్బణం మాత్రం -1.16కు పడిపోయింది. అంటే, ఇక్కడ వీటి ధరలు తగ్గినట్టు కాదు. వీటిని కొనుగోలు చేయాలనుకొనే ప్రజల కొనుగోలుశక్తి సామర్థ్యం తగ్గింది.
ఇలాగైతే రాష్ట్రంలో ఏమైతది?
ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి డిఫ్లేషన్‌లోకి జారిపోయిందంటే ఆ రాష్ట్ర ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటిది తెలంగాణలో నాలుగుసార్లు ఈ డిఫ్లేషన్ పరిస్థితి రావడం ఆందోళనకరంగా మారింది. డిఫ్లేషన్ను ప్రతిబింబించే ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో జీఎస్టీ వంటి పన్నుల వసూళ్లు తగ్గుతాయి. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్టే. రియల్ ఎస్టేట్ కుప్పకూలడంతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వంటి ఆదాయ వనరులు తగ్గి ప్రభుత్వ ఖజానాకు మరో ఎదురుదెబ్బ తగులుతుంది. వ్యాపార పెట్టుబడులు మందగించడంతో ఉపాధిలేక నిరుద్యోగం పెచ్చరిల్లుతుంది. వ్యాపారాలు దెబ్బతింటాయి. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు కుంగిపోతారు. మొత్తంగా అన్నివర్గాలు ఆర్థిక సమస్యలతో కుంగిపోయి ఆత్మహత్యలు పెరిగిపోవచ్చు.
పండుగలూ కాపాడలే..
తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండుగలు బతుకమ్మ, దసరా, దీపావళి అన్నీ అక్టోబర్‌లోనే వచ్చాయి. ఈ సమయంలో నిజానికి కొనుగోళ్లు పెరగాలి. డిమాండ్ పెరగడం అంటే ద్రవ్యోల్బణం పైపైకి రావాలి. అయితే, రాష్ట్ర ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్లిపోయింది. అంటే కొనుగోళ్లు గతంలో మాదిరి జరుగలేదు. ఇది రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి, ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని నిపుణులు మండిపడుతున్నారు.
కారణాలు ఇవేనా?
ప్రజల్లో ఆర్థిక భరోసాను కల్పించే రూ. 4 వేల ఆసరా పెన్షన్, ఎన్నికల్లో మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 ఆర్థిక సాయం, రైతు భరోసా కింద రూ. 15,000, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, విద్యా భరోసా కార్డు కింద రూ. 5 లక్షలు, దళిత బంధుకు రూ. 12 లక్షలు ఇలా పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక చేయూతనిచ్చే ఈ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కడంతో ఆయా వర్గాలకు ఆర్థిక సాంత్వన లేకుండా పోయింది. ఇక, హైడ్రా చర్యలు, బుల్డోజర్ రాజకీయాలు, కబ్జాదారులు పేట్రేగిపోవడంతో రియల్ ఎస్టేట్ పడిపోయి.. దాని అనుబంధంగా పనిచేసే నిర్మాణ, సేవా, బీమా రంగాలు కుంటుపడటం, ప్రభుత్వంలో నెలకొన్న అవినీతితో పెట్టుబడులు తగ్గి, కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలిపోవడం, నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడంలో సర్కారు విఫలమవ్వడం.. వెరసి రాష్ట్రంలో ఏ ఒక్కరిదగ్గరా డబ్బులు లేని పరిస్థితి దాపురించింది.
మోదీ స్వరాష్ట్రంలోనూ అంతే..
కాంగ్రెస్‌పాలిత తెలంగాణలోనే కాదు ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రం గుజరాత్ సహా బీజేపీ పాలిత బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ర్టాల్లోనూ ప్రజల కొనుగోలు శక్తి అమాంతం పడిపోయింది. ఆయా రాష్ర్టాల్లో అక్టోబర్‌లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదవ్వడమే ఇందుకు రుజువు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆర్థిక ప్రగతి పరుగెడుతుందంటూ మోదీ సహా బీజేపీ పరివారం చేస్తున్న ప్రచారమంతా ఉత్తిదేనని దీంతో తేటతెల్లమైంది.
తెలంగాణలో డిఫ్లేషన్‌కు నిపుణులు చెప్తున్న కారణాలు ఏమిటంటే?
బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ డిఫ్లేషన్
తెలంగాణలో 2025లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ), ద్రవ్యోల్బణం ట్రెండ్ ఇలా..