Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారథిని కొనసాగిస్తారా? కొత్త వారిని నియమిస్తారా? అనేది అసక్తికరంగా మారింది. పార్థసారథి పదవీ కాలం ఈ నెల 8తో ముగియనున్నది. పార్థసారథిని మరో ఏడాదిపాటు కొనసాగించే అవకాశం చట్టం ప్రకారం ఉన్నది.
పార్థసారథి పదవీ కాలంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే సీఎంవోకు ఫైల్ పంపించినట్టు సమాచారం. దీనిపై వచ్చే శుక్ర, శని వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరంలో స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ, ఓటరు జాబితా తయారీ కి కసరత్తు ప్రారంభమైంది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి పార్టీల అభిప్రాయాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ పదవి కీలకంగా మారనున్నది.