హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన కార్యాచరణను ప్రారంభించింది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నది. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో గుర్తింపు పొందిన పార్టీలకు ఇప్పటికే ఆహ్వానం పంపింది. ఓటర్ల జాబితాపై పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 6న ఓటర్ల ముసాయిదా జాబితా, 21న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
త్వరలో వర్సిటీలకు కొత్త వీసీలు ; సెప్టెంబర్‌లో సెర్చ్ కమిటీ సమావేశాలు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీలకు త్వరలో కొత్త వైస్చాన్స్లర్లు నియమితులుకానున్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును తీవ్రతరం చేసింది. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో సెర్చ్ కమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఒకే రోజులో సమావేశాలను ముగించి, ఆ తర్వాత గవర్నర్‌కు పంపించనున్నారు. ఆమోదం రాగానే కొత్త వీసీలను నియమిస్తూ ప్రభుత్వ జీవోలను జారీచేసే అవకాశముంది. మొత్తం ప్రక్రియను 15 నుంచి 20 రోజుల్లో ముగించాలని సర్కారు గడువుగా పెట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.
పాత పెన్షన్ విధానమే కావాలి: జేఏసీ
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం సీపీఎస్ స్థానంలో యూపీఎస్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించడాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన సీపీఎస్, యూపీఎస్ రెండు పెన్షన్ విధానాలు వద్దేవద్దన్నారు. పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు రాములు, కే రామకృష్ణ, గోపాల్, రమాదేవి, దర్శన్‌గౌడ్, కత్తి జనార్ధన్, ప్రగతికుమార్, ఎస్ రాములు, సంపత్‌కుమార్ స్వామి పాల్గొన్నారు.