హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వాయిదా మంత్రాన్ని ప్రయోగిస్తున్నది. సోమవారం 11 పురపాలికల్లో చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఇంద్రేశం, జనగామ, ఇబ్రహీంపట్నం, తొర్రూరు, క్యాతన్‌పల్లి, ఖానాపూర్, కాగజ్‌నగర్, జహీరాబాద్ పురపాలికల్లో గులాబీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించినా.. అధికారం, పోలీసు బలగాలను అడ్డంపెట్టుకొని ఆయా పీఠాలను దకించుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. మెజారిటీ వార్డుల్లో విజయం సాధించి, మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్న చోట్ల కూడా చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియను అధికార కాంగ్రెస్ కావాలనే జాప్యం చేస్తున్నట్టు స్థానిక పరిస్థితులను బట్టి తెలుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో ఓటు కూడా వినియోగించుకోకుండా అనేక ఆంక్షలు పెడుతున్నది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పోలీసులతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వెళ్లకుండా అడ్డుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రం పురపాలిక ప్రత్యేక సమావేశాలకు పంపించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
క్షేత్రస్థాయిలో అప్రజాస్వామిక ధోరణి
పురపాలికల్లో చైర్పర్సన్ స్థానాలను హస్తగతం చేసుకొనేందుకు క్షేత్రస్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మొత్తం 22 వార్డులకుగాను 10 వార్డులు బీఆర్ఎస్, 7 కాంగ్రెస్, ఇతరపార్టీలు 4, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. ఇతర ఇద్దరు అభ్యర్థుల మద్దతుతో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ అక్కడ చైర్పర్సన్ పీఠం దకకుండా కాంగ్రెస్ వాయిదాల పర్వానికి తెరలేపింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డులకుగాను 9 గెలిచి బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నా అధికారాన్ని చేజికించుకునేందుకు కాంగ్రెస్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను మభ్యపెట్టి లాగేసుకునేందుకు సమావేశాన్ని వాయి దా వేయించింది. జనగామలో స్వతంత్ర అభ్యర్థులతో కలిసి చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకొనేందుకు బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం చూపించినా కౌన్సిలర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి అవసరమైన కోరం ఉన్నా కూడా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశంతో చైర్పర్సన్ ఎన్నికలను వాయిదా వేసినట్టు విమర్శలు వస్తున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులకుగాను 13 వార్డులు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. కాంగ్రెస్ 8 వార్డులకు పరిమితమైంది. అయినా చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అక్రమమార్గాల్లో కుట్రలకు పూనుకున్నది. సమావేశాన్ని వాయిదా వేయించింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం పురపాలికలో మొత్తం 18 వార్డులకుగాను అత్యధికంగా 9 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకోగా, ఆరు వార్డులు కాంగ్రెస్, రెండు వార్డులు బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. కానీ, ఇక్కడా కూడా వాయిదా వేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో మొత్తం 12 వార్డులకుగాను 4 వార్డులు బీఆర్ఎస్, మరో 4 వార్డులు బీజేపీ, 3 వార్డులు కాంగ్రెస్, ఒకవార్డు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ హంగ్ ఏర్పడింది. బీజేపీతో చేతులు కలిపి చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎన్నికను వాయిదా వేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 37 వార్డులకుగాను అత్యధికంగా 15 వార్డులు గులాబీ పార్టీ గెలుచుకున్నది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతులో స్పష్టమైన మెజారిటీతో చైర్పర్సన్ పీఠాలు దక్కించుకొనే అవకాశం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పీఠం దక్కకుండా చేసేందుకు వాయిదా బాణం ప్రయోగించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో కూడా ఇదే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ వాయిదా మంత్రం జపించింది. 30 వార్డులకు 11 వార్డులు గెలుచుకున్న బీఆర్ఎస్కు చైర్మన్ పదవి దక్కకుండా తొమ్మిది వార్డులకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇతరులను మభ్యపెట్టి, బెదిరించి, ప్రలోభాలతో లోబర్చుకొనే చైర్పర్సన్ కుట్రలకు తెరలేపింది.
