హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థికరంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గుర్తుచేశారు. 2015లో తలసరి పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్వీఏ)లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని తెలిపారు. ఈ విషయాన్ని తాజాగా ఐసీఆర్ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్-మే 2025’ నివేదిక వెల్లడించిందని పేర్కొన్నారు. ఈ నివేదికను బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. తలసరి ఆదాయం రూ.1.25 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు రెట్టింపయ్యిందని తెలిపారు.
ఈ విజయం వెనుక కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక వృద్ధి ఉన్నదని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చిత్రీకరిస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వాస్తవంగా ది వాలా అయింది ఆర్థిక వ్యవస్థ కాదు. ఆయన ఆలోచనలే. ఈ నిరూపిత విజయాలను విస్మరించి, బీఆర్ఎస్ వేసిన బలమైన పునాదిని కొనసాగించకపోవడం అంటే ప్రజలను తప్పుదారి పట్టించడమే కాదు, తెలంగాణ ప్రగతిని అవమానించడమే. ఈ ఆర్థిక విజయం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.