హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) నగారా మోగింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు దశల్లో విడుతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడుత పోలింగ్, అదే నెల 27న రెండో విడుత పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడుత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడుత పోలింగ్ ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 21 నుంచి రెండో విడుత నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 4న రెండో విడుత పోలింగ్ ఉంటుందన్నారు. మూడో విడుత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని, నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 555 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించారు. 5749 ఎంపీటీసీ స్థానాలకు, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు గుర్తించామన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆదివారం సాయంత్రమే గెజిట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు.