DGP | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): పోలీసుశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిసింది. ఎ న్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వ నిర్ణయా లు అమలుకు, తమకు అనుకూలమైనవారిని కీలకపోస్టుల్లో నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఐపీఎస్‌ల బదిలీలు ముగిసిన వెంటనే డీజీపీ మార్పు ఉంటుందని భావిస్తున్నారు.
అది కూడా రెడ్డి సామాజికవర్గం వారికే ఆ ఉన్నత పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. డీజీపీ రేసులో ఇం టెలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్న శివధర్‌రెడ్డి, ఏసీబీ డీజీగా ఉంటూ ప్రభుత్వ లంచాధికారుల వెన్నులో వణుకుపుట్టిస్తున్న సీవీ ఆనం ద్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. డీజీపీ రేసులో ఉంటారనుకుంటు న్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్‌కు విజిలెన్స్ అదనపు బాధ్యతలు అప్పగించింది.
డీజీగా ప్రమోషన్ ఇచ్చి.. బాధ్యతలు అప్పగింత?
డీజీపీని మార్చాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ శివధర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జ రుగుతున్నది. అడిషనల్ డీజీ ర్యాంకులో ఇం టెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డికి డీజీపీగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం డీజీపీ ర్యాంకులో నలుగురు సీనియర్ ఐపీఎస్‌లు కొనసాగుతున్నారు. రవిగుప్తాతోపాటు మాజీ డీజీపీ అంజనీకుమార్, సీవీ ఆనంద్, జితేందర్ ఉన్నారు. డీజీపీ ర్యాంకులోనే విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్త్రన్ గుండెపోటుతో చనిపోయారు.
టీఎస్ నారోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేసిన సందీప్ శాండిల్య కొద్దిరోజుల క్రితం పదవీ విరమణ పొందినా, ఏడాదిపాటు పదవీకాలం పొడిగించారు. ఈ రెండు డీజీపీ ర్యాంకులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్న శివధర్‌రెడ్డికి డీజీపీలుగా పదోన్నతి ఇచ్చి.. శివధర్‌రెడ్డికి డీజీపీ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఆ స్థానంలో సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి లేదా ఐజీ రమేశ్‌రెడ్డిని నియమించే అవకాశం ఉన్నది.
మొదట్నుంచి ముఖ్యమంత్రితోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమానికి వెళ్లినా.. తోడుగా శివధర్‌రెడ్డి ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే లూప్లైన్లో ఉన్న పలువురి సీనియర్ ఐపీఎస్‌లకు కీలక పోస్టులు ఇప్పించడంలో శివధర్‌రెడ్డి కృషి చేశారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
ఐజీల నుంచి ఎస్పీల వరకూ..
రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోలీస్‌శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. పోలీసుశాఖ బదిలీలకు సంబంధించి ఇప్పటికే ఫైలు కదిలిందని సమాచారం. రాచకొండ, కరీంనగర్, వరంగల్, రామగుండం కమిషనర్లకు స్థాన చలనం కలిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. రెండు మల్టీజోన్లలోనూ ఐజీలకు బదిలీతోపాటు పలువురు అడిషనల్ డీజీలకు సైతం కొన్ని శాఖలను కేటాయిస్తారని ప్రచారం సాగుతున్నది. ఖాళీగా ఉన్న ట్రాఫిక్ అడిషనల్ సీపీ పోస్టును భర్తీ చేస్తారని తెలిసింది.