హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర 3వ మహాసభలు ఈనెల 23,24,25 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, కార్యదర్శి టీ సాగర్, ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మంగళవారం రైతుసంఘం రాష్ట్ర కార్యాలయంలో మహాసభల పోస్టర్లను ఆవిషరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాల్లో ఆశించిన మేర మార్పు రాలేదని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నను అప్పులఊబిలోకి నెడుతున్నదని వాపోయారు.
పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మహాసభలకు అఖిల భారత రైతుసంఘం (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే, కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరిబండి ప్రసాద్‌రావు, పీ జంగారెడ్డి, మాటూరి బాల్‌రాజ్‌గౌడ్, రాపర్తి సోమయ్య, వర్ణ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, బొంతు రాంబాబు, ఈసంపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.