గత ప్రభుత్వంపై ఏదో ఒక వంకతో అరోపణలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌పై జీఎస్టీ పన్ను ఎగవేతలకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ నమోదు చేసిన కేసులో.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మెడకే ఉచ్చు బిగుస్తున్నది. ఆరోపించినట్టు రూ.1400 కోట్ల పన్ను ఎగవేసినవారి వివరాలివ్వాలంటూ సెంట్రల్ జీఎస్టీ ఒత్తిడి పెంచుతున్నది.
Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్ కుమార్‌ను ఇరికించాలన్న అత్యుత్సాహంతో రేవంత్‌రెడ్డి సర్కారు వేసిన ఎత్తు బెడిసికొట్టింది. చివరికి అది రాష్ట్ర ప్రభుత్వం మెడకే గట్టిగా చుట్టుకున్నది. వివరాలోకి వెళ్తే.. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర జీఎస్టీ అదనపు కమిషనర్ కాశీవిశ్వేశ్వరరావు, జాయింట్ కమిషనర్ శివరాం ప్రసాద్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్‌బాబు కలిసి కొన్ని సంస్థలతో కుమ్మక్కయ్యారని, పన్ను ఎగవేతలను ప్రోత్సహించారని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని ఈ ఏడాది జూలైలో అప్పటి వాణిజ్య పన్నుల కమిషనర్ టీకే శ్రీదేవి ఓ నివేదికను తయారు చేశారు.
దాని ఆధారంగా జాయింట్ కమిషనర్ రవి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ర్టానికి చెందిన కొన్ని సంస్థలు రూ1,400 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డాయని, ఉద్దేశపూర్వకంగా 75 మంది పన్ను చెల్లింపుదార్ల వివరాలు ఆన్లైన్లో కనిపించకుడా చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే సీఐడీ రంగంలోకి దిగింది. ఆ నలుగురు అధికారులపై కేసు నమోదు చేసింది. దర్యాప్తు కంటే వేగంగా మీడియాకు లీకులు వదులుతూ హడావుడి చేసింది.
ఇదే సమయంలో వాణిజ్య పన్నుల శాఖకే చెందిన మరో అధికారి పోలీసులకు అందిన ఫిర్యాదును, సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని రహస్యంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటు చేసుకున్న పరిణామాలను ఓ లేఖ ద్వారా పీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన పీఎం కార్యాలయం ఆ లేఖను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయానికి ఫార్వర్డ్ చేసి, విచారణకు ఆదేశించడంతో కేంద్ర జీఎస్టీ విభాగం అప్రమత్తం అయింది. రాష్ట్రంలో సీఐడీ దర్యాఫ్తు జరుగుతుండగానే సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) అధికారులు ఎంట్రీ ఇచ్చారు.
పన్ను ఎగవేతలకు పాల్పడిన సంస్థలు, వ్యక్తుల జాబితాతోపాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) దుర్వినియోగం వివరాలు ఇవ్వాలని కోరడంతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కంగుతిన్నారు. కమిషనర్ రూపొందించిన నివేదిక ప్రకారం.. పన్ను ఎగవేతల్లో రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్, ట్రాన్స్‌కో, ఎల్ఐసీ, ఎన్ఎండీసీలదే సింహభాగం. ఈ నాలుగు ప్రభుత్వరంగ సంస్థలు కలిపి రూ.1,000 కోట్లు ఎగ్గొట్టినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. దీని ఆధారంగా ఇప్పుడు సీజీఎస్టీ అధికారులు తమ వాటా ఇవ్వాలని అడుగుతున్నారు.
మరో కేసులో కొందరు 7 బోగస్ సంస్థలను సృష్టించారని, భౌతికంగా వస్తు రవాణా జరకున్నా జరిగినట్టు నకిలీ టాక్స్ ఇన్వాయిస్లు సృష్టించి జీఎస్టీ కౌన్సిల్ ఖాతాల నుంచి రూ.45.67 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేశారని, ఈ వ్యవహారంలో కూడా ఆ నలుగురు అధికారుల ప్రమేయం ఉన్నదని జాయింట్ కమిషనర్ రవి ఫిర్యాదు చేశారు. దీనిపై సీజీఎస్టీ అధికారులు ఆయనను ప్రశ్నించడంతో తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కమిషనర్ శ్రీదేవి చెబితేనే ఫిర్యాదు చేశానని, అంతకుమించి తనకేం తెలియదని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఎలాంటి పురోగతి లేకుండా ఉత్తచేతులతో తిరిగి వెళ్లిపోయిన సీజీఎస్టీ అధికారులు.. తెలంగాణ వాణిజ్య శాఖలో ఏదో జరుగుతున్నదని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని పీఎం కార్యాలయానికి లేఖ రాసినట్టు సమాచారం.
దీంతో బెంబేలెత్తిన రాష్ట్ర ప్రభుత్వం.. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవిని విధుల అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది. మరో పోలీస్ అధికారిని భాధ్యునిగా చేస్తూ ఆయనను విధుల నుంచి తప్పించింది. అనంతరం ఆయా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పొరపాటు జరిగిందని, వాస్తవానికి ఎలాంటి పన్ను ఎగవేతలు జరగలేదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను బదిలీ చేశామని కేంద్రానికి నివేదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కానీ, ఆ లేఖతో సీజీఎస్టీ అధికారులు సంతృప్తి చెందలేదని, నకిలీ ఇన్వాయిస్లతో క్లెయిమ్ చేసిన రూ.45.67 కోట్లను ఎవరు తిరిగి ఇస్తారో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతోపాటు జీఎస్టీలో కేంద్రం వాటాను ఎగ్గొట్టేందుకు రాష్ట్ర స్థాయిలో కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దుర్వినియోగంపై సీబీఐతో దర్యాప్తు జరిపించేందుకు ‘కాగ్’ సిద్ధమవుతుండటంతో ఈ ఉపద్రవం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక రేవంత్‌రెడ్డి సర్కారు తర్జనభర్జన పడుతున్నది.
వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పరువు మంటగలవడంతోపాటు రూ.700 కోట్ల డబ్బు కూడా పోయే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతుండటంతో ఈ గండం నుంచి బయపడేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. కాగా, పీఎం కార్యాలయానికి లేఖ రాసినట్టు అనుమానిస్తున్న ఇద్దరు అధికారులను బదిలీ చేసినట్టు వాణిజ్య పన్నుల శాఖలో చర్చ జరుగుతున్నది.