హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైంది. అనంతరం ఆ వివరాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియాకు మంత్రి పొంగులేటి వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభావం, తాగు, సాగునీటి ఇబ్బందులు, ఉపాధి కూలీల పరిస్థితులను సమగ్రంగా వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్ నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 40% వర్షపాతం లోటు ఉన్నదని, తాగు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు సరఫరాపై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో కలిసి ‘వ్యవసాయ రంగంపై ఎల్ నినో ప్రభావం’పై ప్రత్యేక నివేదిక రూపొందించాలని మంత్రివర్గం సూచించిందని తెలిపారు. ఈ నెల 20న ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో అకడి ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ధరణిపై విచారణకు సెట్ ఏర్పాటు
భూముల రికార్డులు, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన 2020 అక్టోబర్ 29 నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా జరిగిన అన్నీ అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ఇంజినీరింగ్ పనుల్లో అప్రైజల్ నుంచి ప్రాజెక్టు ప్రపోజల్, భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపు విధివిధానాలన్నింటికీ ఒక యూనిఫైడ్ విధానాన్ని రూపొందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
పాలమూరు ఎత్తిపోతల పనుల అంచనాల పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్సెజెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించినట్టు పేర్కొన్నారు. పంచాయతీల నిధుల నిర్వహణకు సంబంధించి ట్రెజరీలో జమ చేసే విధానం నిబంధనను మార్చి పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్లు, స్టేషన్ల స్థానాలను ఆర్ అండ్ బీ విభాగం రాష్ట్ర క్యాబినెట్‌కు తెలిపినట్టు తెలిపారు. ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తికి, విద్యాశాఖలో పోస్టుల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పొంగులేటి వెల్లడించారు.