హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అసంబద్ధ, అనాలోచిత నిర్ణయాలతో ఓవైపు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. ‘అప్పు పుడుతలేదు.. మనల్ని ఎవరూ నమ్ముతలేరు’ అని స్వయంగా ముఖ్యమంత్రే సెలవిచ్చిన క్రమంలో కాంగ్రెస్ సర్కారు ఆర్థిక సంక్షోభంలో కూరుకొని కొట్టుమిట్టాడుతున్నది. రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగుల బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కీలక పథకాలకు నిధులు సమకూర్చలేక కిందామీదా పడుతున్నది. దివాలా.. దివాలా అంటూ రాష్ట్ర పరపతిని దిగజార్చి చివరికి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చారని ఆర్థిక నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానున్నందున పథకాల కోసం నిధుల సమీకరణపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. ‘ఇన్ని పైసలు ఏడికెళ్లి తెచ్చుడు.. ఎట్లిచ్చుడు?’ అన్న అంశమే ప్రధాన ఎజెండా అని తెలుస్తున్నది. సరిపడా డబ్బులు లేకనే తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు ప్రారంభించాల్సిన యువ వికాసం పథకాన్ని వాయిదా వేసినట్టు వినికిడి!
రాష్ట్రం ఎదురొంటున్న ఆర్థిక ఒత్తిడి సామాన్యులను, ఉద్యోగులను, విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి సీజన్ రైతు భరోసా ఇప్పటికీ పూర్తికాలేదు. మూడెకరాల రైతులకు మాత్రమే పడ్డాయి. మూడెకరాలకుపైగా ఉన్న రైతులకు రైతు భరోసా అందలేదు. ఇంకా రూ.4,000 కోట్ల బకాయి ఉన్నది. ఇప్పుడు వానకాలం సీజన్‌కు మరో రూ.9,200 కోట్లు కావాలి. అంటే రూ.13,200 కోట్ల నిధులకు క్యాబినెట్ ఆమోదం తెలుపుతుందో లేదో చూడాలి. ఇప్పటికే వానకాలం పంట సీజన్ మొదలైంది. కొందరు నార్లు పోయగా, ఆదివారం మృగశిర కార్తె నుంచి రైతులంతా వరి నారు పోసుకోడానికి విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. యాసంగి పూర్తికాకపోగా, వానకాలం పంట రైతుభరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో పంట సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటికే యువ వికాసం పథకం అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.6,000 కోట్లు ప్రతిపాదించారు. తొలుత రూ.50 వేలు, రూ. లక్ష యూనిట్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయించారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెక్కులు ఇవ్వనున్నట్టు అధికారుల సమీక్షలో, సభల్లోనూ చెప్పారు. నిధుల సమీకరణ లేకుండా తేదీ ఎలా నిర్ణయిస్తారని డిప్యూటీ సీఎంను ముఖ్యమంత్రి అడిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జూన్ 2న యువవికాసం పథకం వాయిదా పడినట్టు సమాచారం. క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఓకే చెప్పి అమలు చేస్తారా? లేక మళ్లీ వాయిదా వేస్తారా? అనేది చూడాలి.
ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 1 వస్తే ఆరో డీఏ పెండింగ్‌లో పడ్డట్టే! పెండింగ్ డీఏల కోసం ఉద్యోగులు పోరుబాట పట్టారు. సర్కారుపై సమరానికి సిద్ధమయ్యారు. ఉద్యోగుల 57 సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై ప్రతిపాదనలు స్వీకరించింది. అన్నీ క్రోడీకరించి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. బుధవారం చివరగా తమ సమస్యలు తీర్చాలని, డిమాండ్లు నెరవేర్చాలని జేఏసీ నేతలు మంత్రుల సబ్ కమిటీ చైర్మన్ అయిన భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం ఒక్క డీఏ చెల్లించాలనుకున్నా కనీసం రూ.700-800 కోట్లు అవసరమవుతాయి. అత్యవసరంగా చెల్లించాల్సిన బకాయిలు రూ.1,000 కోట్ల వరకు ఉన్నాయి. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మొత్తం రూ.11,000 కోట్లకు చేరింది. ఇక ఈహెచ్ఎస్, పీఆర్సీ వంటివి ముందున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు గుదిబండగా మారాయి. రూపాయి కూడా విడుదల కాకపోవడంతో యాజమాన్యాలు రెండుసార్లు పరీక్షలను బహిష్కరించాయి. వీటిల్లో ఎన్నింటికి క్యాబినెట్ ఆమోదం తెలుపనున్నదనేది చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు రేవంత్ సరారు భూముల అమ్మకానికి సిద్ధపడుతున్నది. కంచ గచ్చిబౌలి భూముల విక్రయానికి తెరలేపగా ఇది వివాదాస్పదమైంది. హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లు, బీఆర్ఎస్ పోరాటం, సుప్రీంకోర్టు జోక్యంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన హౌసింగ్ భూములపై కన్నేసినట్టు తెలిసింది. హౌసింగ్ భూముల అమ్మకాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని విలువైన భూములను అమ్మి నిధులు సమకూర్చాలనే ప్రతిపాదనపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరగనున్నది. భూముల అమ్మకం వల్ల రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం, పర్యావరణ విధ్వంసం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దివాలా.. దివాలా.. అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా ఇప్పుడు రాష్ర్టాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారని విమర్శిస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరైన దిశలో నడపలేక, ఆదాయ వనరులను పెంచలేక, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వం.. దీర్ఘకాలిక పరిషారాల కంటే తాతాలిక చర్యలపైనే ఆధారపడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్యాబినెట్ సమావేశంలో తీసుకొనే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించనున్నాయి.
నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు రూ.22,500 కోట్లు అవసరం ఉన్నది. తొలి విడత లబ్ధిదారులను కూడా కొన్ని ప్రాంతాల్లో సర్కారు ఎంపికచేసింది. ఆయాచోట్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం ప్రారంభించగా వారి ఖాతాల్లో మూడు దఫాల్లో నిధులు జమచేయాల్సి ఉన్నది. ఈ భారీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించే మార్గం లేక, ప్రభుత్వం హడలిపోతున్నది. ఇందిరమ్మ పథకం అమలుపైనా క్యాబినెట్లో చర్చించి నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. నిధులను బట్టే ఇందిరమ్మ ఇండ్ల పథకం సాఫీగా సాగుతుందా? లేదా? అనేది తేలనున్నది.