హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందడుగు పడుతుం దా? బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రేవంత్రెడ్డి సర్కారు ఏం చేయబోతున్నది? పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తుందా? లేక మళ్లీ వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నల నడుమ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నది.
దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. క్యాబినెట్ భేటీలో ప్రధానంగా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులతోపాటు బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా, స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలినట్టు తెలిసింది. వెంటనే ఎన్నికలకు వెళ్లాలని ఓ వర్గం, రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మరో వర్గం డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.