రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అవుతున్నదంటే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటుందని చాలామంది భావించారు. కనీసం ఆర్టీసీ విలీనం, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదలపై నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. కానీ, సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగిందని, కేవలం డబ్బు చుట్టే తిరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. భూములు అమ్మకం, ధరలు పెంచడం.. ఇలా వీలైనన్ని మార్గాల్లో ఖజానాను నింపడంపైనే దృష్టి పెట్టారని చెప్తున్నారు. ప్రధానంగా విలువైన ప్రభుత్వ భూములను విక్రయించేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. సాధ్యమైనంత త్వరలో భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరలు పెంచి, ఆదాయం రాబట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): సాధ్యమైనంత త్వరలో భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరలు పెంచి, ఆదాయం రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో సుదీర్ఘచర్చ సాగినట్టు తెలుస్తున్నది. మద్యం ధరల పెంపు మీద ప్రైస్ కమిటీ నివేదిక, భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు మీద సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలు సిద్ధంగా ఉన్నాయని, భూముల విలువను రెండుమూడు రెట్లు పెంచాలని, రిజిస్ట్రేషన్ చార్జీలను 20% నుంచి 40% వరకు పెంచాలని, మద్యం మీద 12% వరకు ధరలు పెంచాలని మంత్రివర్గం తీర్మానం చేసినట్టు చర్చ జరుగుతున్నది. పెంచిన రిజిస్ట్రేషన్ ధరలను ఈ నెల చివరి వారంలో, మద్యం ధరల పెంపును జూన్ రెండవ వారంలోపు అమల్లోకి తీసుకొనిరావాలని నిర్ణయించినట్టు సమాచారం.
వివాదాస్పదమైన హిల్ట్ పాలసీని వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినా, ఈ పాలసీ వరకు పాత ధరలనే వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రూ.5 లక్షల కోట్ల విలువైన ఈ భూముల్లో భారీ అవినీతి జరుగుతున్నదని గతంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. హైకోర్టులో కూడా కేసులు వేశారు. వీటిని లెక్కచేయకుండా ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నది. నిర్ధారించిన భూ రిజిస్ట్రేషన్ విలువలో 10% ముందుగా చెల్లిస్తే, మిగిలిన డబ్బు చెల్లింపునకు 90 రోజులు గడువు ఇస్తామని ప్రకటించింది.
రిజిస్ట్రేషన్, మద్యం ధరలకు రెక్కలు
రాష్ట్రంలో భూములు రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదికపై చర్చించిన క్యాబినెట్, ఈ నెల 26లోగా పెంచిన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి తేవాలని నిర్ణయించింది. వ్యవసాయ భూముల ధరలు మూడింతలు, వ్యవసాయేతర ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్లపై రెండింతలకుపైగా భారం పడనున్నది. గ్రామాల్లో ఎకరం రూ.1 లక్ష ఉన్న రిజిస్ట్రేషన్ ధర రూ.3 లక్షలకు, నగరాల్లో రూ.6లక్షలుగా ఉన్న రిజిస్ట్రేషన్ ధర రూ.18లక్షల వరకు పెంచుకోవచ్చని అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన సూచనలకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు రాష్ట్రంలో మరోసారి మద్యం ధరలు పెంచాలని క్యాబినెట్లో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రైస్ కమిటీ మద్యం ధరల పెంపు మీద చర్చించి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. ఈ నివేదికపై భట్టి విక్రమార్క నేతృత్వంలోని రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ అధ్యయనం చేసినట్టు సమాచారం. బీరు, బ్రాందీ, విస్కీ బ్రాండ్ల మీద గరిష్ఠంగా 12% మేర పెంచడానికి మౌఖిక అంగీకారం తెలిపినట్టు తెలిసింది. మరోసారి క్యాబినెట్లో చర్చించిన తరువాత ధరల పెంపుపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
మదర్ డైయిరీకి బైబై
40 ఏండ్లుగా ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పాడి రైతులకు వెన్నెముకగా నిలిచిన మదర్ డెయిరీతో బంధం తెంచుకొనేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. 32 వేల మంది రైతులకు జీవనాధారమైన నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) డెయిరీ నిర్వహణ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకొని, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు(ఎన్డీడీబీ) అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్డీడీబీ క్రమంగా స్థానిక పాడి రైతుల నుంచి పాల సేకరణను తగ్గిస్తూ.. బయటి ప్రొడక్ట్‌ను విక్రయానికి ప్రాధాన్యమిస్తుందన్నారు.
రూ.6వేల కోట్లు అసాధ్యం
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మంత్రివర్గం చర్చిస్తుందని కార్మికులు ఆశించారు. కానీ, ప్రభుత్వం వారి ఆశలను అడియాశలు చేస్తూ విలీనం అంశాన్నే చర్చకు పెట్టనట్టు తెలిసింది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.6 వేల కోట్ల బెనిఫిట్స్ మీద క్యాబినెట్లో చర్చ జరిగినట్టు తెలిసింది. 100 రోజుల్లో దశలవారీగా బెనిఫిట్స్ చెల్లిస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ హామీపై భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు అంత డబ్బు సేకరించడం అసాధ్యమని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. పాత అప్పులను రీషెడ్యూల్ చేద్దామని సీఎం సూచించగా, ఇప్పటికే చాలా అప్పులు రీషెడ్యూల్ చేశామని భట్టి చెప్పారట. అయినా.. అవకాశం ఉన్న అప్పులను రీ షెడ్యూల్ చేయడానికి రిజర్వ్‌బ్యాంకుకు లేఖ రాయాలని సీఎం సూచించినట్టు తెలిసింది. వచ్చేది వానకాలం అని, గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్కైనా నిధులు ఇవ్వకపోతే ఇబ్బందులు పడుతామని, వానకాలంలో చెల్లించాల్సిన రైతుభరోసా దగ్గరకు వచ్చిందని, వీటిని వదిలేసి రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేమని భట్టి విక్రమార్క తేల్చి చెప్పినట్టు సమాచారం.