హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల అంచ నా ప్రతిపాదనలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా పేర్కొన్నది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931గా ఉన్నట్టు తెలిపింది. రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతమని ప్రకటించింది. రాష్ట్ర బడ్జెట్ను శుక్రవారం ఉదయం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టగా, శాసనమండలిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆర్థికశాఖకు 60,438 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 33,688 కోట్లు ప్రతిపాదించారు.
సెకండరీ, ఉన్నత విద్యాశాఖలకు రూ.26,674 కోట్లు, వ్యవసాయం, సహకార శాఖలకు రూ.23,179 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు 22,615 కోట్లు, విద్యుత్తు శాఖకు 21,285 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, గృహనిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు కేటాయించారు. అసెంబ్లీలో గంట 53 నిమిషాల పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి ఉత్తమ్ తమ బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. వరుసగా 4వ సారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టిని సీఎం రేవంత్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అభినందించారు.
దళితులకు అన్యాయం కొంగరి శంకర్ మాదిగ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.11,784 కోట్లు ఎస్సీ సంక్షేమశాఖకు కేటాయించి దళితులకు అన్యాయం చేసిందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ విమర్శించారు. దళితులకు అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షలు ఇస్తామన్న హామీకి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరుగలేదని మండిపడ్డారు.
బీసీలకు సర్కార్ మోసం బీసీ హకుల సాధన సమితి
బడ్జెట్లో బీసీలకు మరోసారి తీరని అన్యాయం జరిగిందని బీసీ హకుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మా ట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రతి బడ్జెట్లో బీసీలకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. ఇలా చేయడం బీసీలను మోసం చేసినట్లేనని పేర్కొన్నారు.
2026-27 వార్షిక బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపులు (కోట్లలో)