హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కల్తీ విత్తనాలకు గేట్లు ఎత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల ముఠాలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటు వ్యవసాయ శాఖ, అటు టాస్క్‌ఫోర్స్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు బలం చేకూర్చుతున్నది. ఈ సీజన్లో టాస్క్‌ఫోర్స్ చేసిన దాడులు, సీజ్ చేసిన విత్తనాల వివరాలు టాస్క్‌ఫోర్స్ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ ముఠాలు రాష్ట్రంలోకి ప్రవేశించి రైతులకు విత్తనాలు అంటగడుతుంటే, అధికారులు తీరిగ్గా తనిఖీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నకిలీ పత్తి విత్తనాల విషయంలో సర్కార్ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధిత హెచ్‌టీ (హెర్బిసైడ్ టోలరెంట్) పత్తి విత్తనాలను యథేచ్ఛగా విక్రయిస్తూ రైతులను నిండా ముంచుతున్నారనే విమర్శలున్నాయి.
టాస్క్‌ఫోర్స్ యాక్షన్ టీమ్ ఈ సీజన్లో జూన్ రెండో వారం వరకు నిర్వహించిన తనిఖీలు, సీజ్ చేసిన విత్తనాలు, నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే, నకిలీ విత్తనాల సరఫరాపై సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో అర్థమవుతుంది. తనిఖీల్లో భాగంగా ఒక్క గింజ విత్తనాన్ని కూడా స్వాధీనం చేసుకోకపోవడం (డిటెయిన్డ్) గమనార్హం. అయితే ఇప్పటివరకు కేవలం 260 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను మాత్రమే సీజ్ చేసినట్టు తెలిసింది. సీజ్ చేసిన విత్తనాల విలువ రూ.290 కోట్లుగా ఉంటుందని అంచనా. అయితే 2024లో ఏకంగా 1,200 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేయడం గమనార్హం.
గత సంవత్సరం ఇది 320 క్వింటాళ్లకు తగ్గగా, ఈ ఏడాది 260 క్వింటాళ్లకే పరిమితమైంది. అంటే వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా దాదాపుగా లేనట్టే! అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఇలాంటి పరిస్థితి ఉన్నదా అంటే లేదనే చెప్తున్నారు రైతులు. అధికారుల నిర్లక్ష్యం, నకిలీ విత్తన ముఠాలతో కుమ్మక్కై తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అధికారులెవరూ నకిలీ విత్తనాల గురించి పట్టించుకోవడంలేదని, విత్తనాల షాపుల్లో తనిఖీలు చేయడంలేదని ఆరోపిస్తున్నారు.
నకిలీ విత్తన ముఠాలను అడ్డుకోవడంలోనే కాదు; విత్తనాల నాణ్యతను తనిఖీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతున్నదనే విమర్శలున్నాయి. ఈ సీజన్లో 12వేల విత్తన శాంపిల్స్‌ను తనిఖీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, జూన్ రెండో వారం వరకు 550 విత్తన శాంపిల్స్‌ను మాత్రమే సేకరించినట్టు తెలిసింది. నిరుడు 11,500 శాంపిల్స్‌ను తనిఖీ చేసినట్టు తెలిసింది. తనిఖీల్లో నాణ్యతలేని విత్తన నమూనాలకు సంబంధించి నిరుడు 217 కేసులు నమోదు చేయగా, ఈ సీజన్లో ఒక్కటంటే ఒక్క కేసు మాత్రమే నమోదు చేశారు. ఇందులో గత సంవత్సరం 107 కేసుల్లో విచారణ ప్రారంభించగా, ఈ సీజన్లో విచారణ జాడనేలేదు. ఇలా తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు చర్యల్లోనూ అంతకు మించి నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో బీజీ-2 (బోల్‌గార్డ్) పత్తి విత్తనాలను మాత్రమే సాగు చేయాలి. కానీ, నిషేధిత హెచ్‌టీ (హెర్బిసైడ్ టోలరెంట్) పత్తి విత్తనాల దందా జోరుగా జరుగుతున్నదని తెలిసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల కేంద్రంగా ఈ దందా జోరుగా సాగున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన నకిలీ విత్తన ముఠాలు ఈ విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల మల్కాజిగిరి, వికారాబాద్‌లో చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి.
అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ముఠాలు గ్రామాల్లోకి ప్రవేశించి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాయనే ఆరోపణలున్నాయి. పలు విత్తనాల షాపుల యజమానాలు ముఠాలతో చేతులు కలిపి రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారుల మాయమాటలు నమ్మి విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత అవి మొలకెత్తకపోవడం, మొలకెత్తిన తర్వాత పూత, కాత లేకపోవడం, దిగుబడి తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి కొన్ని సందర్భాల్లో నకిలీ విత్తనాలతో పంట మొత్తం దెబ్బతిని పెట్టుబడి కూడా నష్టపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు. అప్పులపాలై చివరికి ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ విత్తనాల ముఠాపై ఉక్కుపాదం మోపాల్సిన సర్కార్.. ఉదాసీనంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
నకిలీ విత్తన ముఠాలు, కంపెనీలపై ప్రేమ వల్లనో, లేక రాష్ట్రంలో అసలు నకిలీ విత్తనాల దందానే లేదని చెప్పదలుచుకుంటున్నారో ఏమో గానీ సర్కార్ నకిలీ విత్తన ముఠాలపై చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేండ్లలో రాష్ట్రంలో నకిలీ విత్తన ముఠాలపై ఒక్కటంటే ఒక్క పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అదే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మూడు కంపెనీలపై పీడీ యాక్ట్ నమోదు చేయగా 21 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసింది.
ఈ మూడేండ్లలో పీడీ యాక్ట్‌లు నమోదు కాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తున్నది. అరెస్టులు, కేసుల నమోదు కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. గత సంవత్సరం 127 మందిని అరెస్ట్ చేయగా, ఈ సీజన్లో 39 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. అదే విధంగా నిరుడు 6ఏ కేసులు తొమ్మిది బుక్ చేయగా, ఈ సీజన్లో ఒక్కటే నమోదు చేశారు. నిరుడు 54 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, ఈ సీజన్లో 19 మందిపైనే నమోదు చేశారు. ఈ సీజన్లో ఒక్క కంపెనీ, ఒక్క వ్యక్తి లైసెన్స్ కూడా రద్దు చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
