ఆదిలాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : మూతబడిన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను తిరిగి ప్రారంభించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని బీఆర్ఎస్ నాయకులు కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆయన చాంబర్లో రాజ్యసభ బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదరరావు, మాజీ మంత్రులు జోగు రామన్న, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు సీసీఐ సాధన కమిటీ సభ్యులు కలిశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులూ కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేసినట్టు గుర్తుచేశారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పరిశ్రమను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వేలాది మందికి ఉపాధి కల్పించే సీసీఐ ప్రారంభానికి అవసరమైన ముడిసరుకు, విద్యుత్తు, ఇతర వనరులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పరిశ్రమ ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. అలాగే, మహబూబ్‌నగర్‌లోనూ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.
హెచ్‌సీయూ భూముల వేలాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదరరావు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కేంద్ర మంత్రి.. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీలకు హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, బీఆర్ఎస్వీ నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగ బాలు, విద్యార్థి నాయకులు ఉన్నారు.