దామరగిద్ద, సెప్టెంబర్ 22 : నారాయణపేట జిల్లా దామరగిద్ద పీఏసీఎస్‌కు పల్లీ విత్తనాలు వచ్చాయని తెలుసుకొన్న 200 మంది రైతులు సోమవారం పెద్ద ఎత్తున చేరుకున్నారు. తెల్లవారుజాము 5:30 గంటల నుంచే పడిగాపులు కాయడంతో కార్యాలయ సిబ్బంది ఉదయం 8 గంటల తర్వాత వచ్చి వేరుశనగ విత్తనాలు పంపిణీకి సిద్ధమవగా.. రైతులు ఎగబడటంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో నర్సాపూర్‌కు చెందిన వెంకటప్ప కాలు విరిగింది. సిబ్బంది పంపిణీని నిలిపివేయగా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు నారాయణపేట-మద్దూరు రహదారిపైకి చేరుకొని ఆందోళనకు దిగారు. 2 గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వ్యవసాయాధికారి రైతులను పీఎస్‌కు పిలించి ఎస్సై రాజుతో కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పీఏసీఎస్ తాళం విరగ్గొట్టి దాదాపు 90 సంచులను కొందరు ఎత్తుకుపోయినట్టు వ్యవసాయ అధికారి తెలిపారు. ఎస్సై అక్కడకు చేరుకొని రైతులను గేటు బయటే నిలబెట్టి ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేయించారు.