Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): డాక్టర్ కల సాకారం చేసుకోవానుకుంటున్న తెలంగాణ బిడ్డలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. ‘స్థానికత’ నిర్ధారణలో వైద్యారోగ్య శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్నది. కనీస అధ్యయనం లేకుండా హడావుడిగా జీవో 33ని తీసుకొచ్చి విద్యార్థులకు అన్యాయం చేసిన ప్రభుత్వం.. దాన్ని సవరించుకోవాల్సింది పోయి మొండిగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ విద్యార్థులకు నష్టం కలుగకుండా స్థానిక కోటా కింద అవకాశం కల్పించాలని, ఈ మేరకు నిబంధనలు రూపొందించాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం చెవికి ఎక్కలేదు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద తెలంగాణ తరఫు న్యాయవాది ప్రతిపాదించారు. దీంతో త్వరగా విచారణకు తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం తెలిపింది.
స్థానికతను నిర్ధారించడంలో ప్రభుత్వం మొదటి నుంచీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. తెలంగాణ, ఏపీ మధ్య ఈ ఏడాది జూన్ 2తో ‘ఉమ్మడి’ బంధం శాశ్వతంగా ముగిసిపోతున్న నేపథ్యంలో స్థానికతను నిర్ధారించుకోవాలన్న సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. మెడికల్ సీట్లలో ఉమ్మడి కోటాపై నిర్ణయం తీసుకోవాలని, స్థానికతను నిర్ధారించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి ఈ ఏడాది జనవరిలోనే వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత వైద్యశాఖ అంతర్గత సమావేశాల్లోనూ పలుమార్లు ఈ అంశం ప్రస్తావనకు వచ్చినా ‘చూద్దాం లే’ అన్న ధోరణిలో వ్యవహరించారు. ‘స్థానికత’ను నిర్ధారించాలని ఇతర యూనివర్సిటీలు, సాంకేతిక విద్యాశాఖ నుంచి సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. కానీ పట్టించుకోలేదు. ఇంజినీరింగ్ ప్రవేశాల సమయంలోనూ ఉమ్మడి కోటాపై తర్జనభర్జనలు జరిగినా.. జూన్ 2వ తేదీకి ముందే అడ్మిషన్లు జరగడంతో కోటాను కొనసాగించారు. కానీ మెడికల్ సీట్లపై మాత్రం వైద్యారోగ్య శాఖ మీనమేషాలు లెక్కించింది. చివరికి పీకలమీదికి వచ్చిన తర్వాత జూలై 19న తూతూమంత్రంగా జీవో-33 ఇచ్చింది. వ్యతిరేకత వస్తుందన్న భయంతో జీవోను బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉంచింది. రెండు వారాల తర్వాత అడ్మిషన్ల నోటిఫికేషన్‌తోపాటు విడుదల చేసింది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివిన వారిని మాత్రమే ‘స్థానికులు’గా గుర్తిస్తామని పేర్కొన్నది. దీంతో ఇతర రాష్ట్రాల్లో మంచి విద్యాసంస్థల్లో చదివినవారు, ఉద్యోగరీత్యా తల్లిదండ్రుల బదిలీలు, ఇతర కారణాల వల్ల ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివిన తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా మారిపోయారు.
జీవో 33ను రద్దు చేయాలంటూ హైకోర్టులో 53 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ అనంతరం ఈ నెల 5న తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల్లో అవకాశం కల్పించాలని ఆదేశించింది. రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానికత వర్తించదనడం అన్యాయమని పేర్కొన్నది. ఒక విద్యార్థిని తెలంగాణ శాశ్వత నివాసిగా ఎలా గుర్తించాలో మార్గదర్శకాలు, నిబంధనలు లేవని గుర్తుచేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ సమీక్షించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ.. అలా జరగకుండా దాదాపు వారం రోజులు వృథా చేసి, చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయినట్టేనని వైద్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. కనీసం హైకోర్టు తీర్పు వచ్చిన ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. ఇప్పటివరకు ఏదో ఒకటి తేలిపోయేదని అంటున్నారు. రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలు, దవాఖానల్లో వసతులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం గత నెల 16వ తేదీన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. డీఎంఈ సభ్యకార్యదర్శిగా, డీఎంఈ (అకడమిక్), హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉన్నారు. తీర్పు వచ్చిన వెంటనే సమీక్షించకుండా టాస్క్‌ఫోర్స్ ఏం చేసిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్థానికత నిర్ధారణలో ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు స్థానికత, రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చైర్మన్‌గా, ఎనిమిది మంది ఉన్నతాధికారులు, అడ్మిషన్ల రంగంలో నిపుణులు ఒకరిని సభ్యులుగా కమిటీని ఏర్పాటుచేసింది. స్థానికత, ఉమ్మడి కోటా అంశంపై నిపుణులు, విద్యార్థులు, అసోసియేషన్ల నుంచి అభిప్రాయాలు తీసుకొని నివేదిక సమర్పించింది. ఈ మేరకు ఏపీలో స్థానికతను నిర్ధారించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన ఎంబీబీఎస్, బీడీఎస్ నోటిఫికేషన్లో స్థానికతపై స్పష్టత ఇచ్చారు. వివిధ కారణాలతో స్థానికంగా ఇంటర్ చదవలేని వారికి ‘ఏపీ నాన్‌లోకల్’ స్టేటస్ ఇచ్చి, సీట్లలో కోటా ఇవ్వడంతో స్థానికతపై వివాదాలు తలెత్తలేదు.