ఇలా చేనేత రంగానికి ఇచ్చిన ప్రోత్సాహకాలతో పదేండ్లలో ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడింది.
ఫలితంగా పనుల్లేక నేత న్నలు అప్పులపాలయ్యారు. కుటుంబ పోషణ భారమై ఏడు నెలల్లోనే12 మంది తనువు చాలించారు.
Telangana | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు చేతిలో పనుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడాల్సి వస్తున్నది. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను అటక్కెక్కించడంతో చేనేతరంగం చితికిపోయింది. రాష్ట్ర వస్త్ర శాఖ కుదేలు కావడంతో సాంచాలను తుక్కుకింద అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇటు పనుల్లేక.. అటు కుటుంబాలను పస్తులుంచలేక.. మరోవైపు అప్పులు తీర్చే దారిలేక ఏడు నెలల్లోనే 12మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతను కండ్లకు కడుతున్నది. చేనేత రంగంలో మళ్లీ పదేండ్ల నాటి దారుణ పరిస్థితులు వచ్చాయని కార్మికుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 నుంచి 2023 వరకు ఏడేండ్లపాటు నిరంతరాయంగా బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని అమలుచేసింది. కష్టతరమైనా కొవిడ్ కాలంలోనూ చీరల పంపిణీని కొనసాగించింది. ఏటా మహిళలకు కోటి చీరల దాకా కానుకగా అందించింది. 25 నుంచి 30 విభిన్న డిజైన్లలో సుమారు 240 రకాల చీరలను పది రంగుల్లో పంపిణీ చేసింది. ఇందుకు ఏటా ప్రభుత్వం రూ.320 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు ఖర్చు చేసింది. వీటిలో 90 శాతం వరకు చీరల తయారీ ఆర్డర్లను జనవరిలోనే సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చేది. చీరల తయారీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా కొనసాగేది. దాదాపు 15 వేల పవర్‌లూమ్స్ కార్మికులకు చేతినిండా పనిదొరికేది. పేద మహిళలు, చేనేత, అనుబంధ కార్మికులు, ఇతరులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు నేటికీ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడింది. పవర్‌లూమ్స్‌లో పనిలేక, బాధలు తాళలేక నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇటీవల పద్మశాలి సంఘం, చేనేత సహకార సంఘం ప్రతినిధులు చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి నేత కార్మికుల సమస్యలు, పరిశ్రమ సంక్షోభం గురించి వివరించారు. ప్రభుత్వ పరంగా అండగా నిలవాలని కోరారు. నేతల ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణమే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కానీ, ఆర్డర్లపై స్పష్టంగా చెప్పకుంండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మంత్రి చెప్పారని నేతలు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 4వ క్యాటగిరీ కింద పవర్‌లూమ్స్‌కు విద్యుత్తును రూ.4కు యూనిట్ చొప్పున సరఫరాచేసింది. ఇందులో రూ.2 సబ్సిడీ పోను రూ.2 మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్తును 3వ క్యాటగిరీ కిందకు మార్చడం వల్ల యూనిట్‌కు రూ.8.5 చెల్లించాల్సి వస్తున్నది. 10 హెచ్‌పీ సామర్థ్యం దాటిన పవర్‌లూమ్స్ యాజమానులు యూనిట్‌కు రూ.8.5 చెల్లించాల్సి వస్తున్నందున పది లూమ్స్ ఉన్న యజమాని ఒక్క కార్మికుడితో ఆరు లూమ్స్నే నడిపిస్తున్నాడు. ఫలితంగా చాలా మందికి పనిలేకుండా పోతున్నది. నేతన్న బీమా, త్రిప్ట్, నేతన్న చేయూత పథకాలు కూడా సక్రమంగా అమలుకావడం లేదు. నేత కార్మికులను యజమానులు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం రూ.350 కోట్లతో సిరిసిల్లలో ‘వర్కర్ టు ఓనర్’ షెడ్లను నిర్మించింది. విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది. కేవలం లూమ్స్ ఏర్పాటు చేయడమే మిగిలింది. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో వర్కర్ టు ఓనర్ షెడ్ల వ్యవహారం నిలిచిపోయింది. లూమ్స్ రాకపోవడంతో నేత కార్మికుల శాశ్వత ఉపాధికి గండిపడింది. లూమ్స్ బిగిస్తే 1100 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది.
గత కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు, ఇతర కార్యక్రమాలు అమలుచేసింది. బడ్జెట్ కేటాయింపులూ పెంచింది. మగ్గాల ఆధునికీకరణకు ఆర్థికసాయం అందించింది. రుణాలు మాఫీచేసింది. మార్కెట్ అనుసంధానం వంటి చర్యలు చేపట్టింది. వర్క్ ఆర్డర్లు పెంచింది. బతుకమ్మ చీరల ఉత్పత్తి, స్కూల్ యూనిఫామ్‌ల తయారీ వంటి పనులు అప్పగించింది. ఈ చర్యలు చేనేత పరిశ్రమకు పునర్జీవాన్నిచ్చాయి. ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చాయి. చేతి నిండా పని దొరకడంతో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయి. గతంలో మహారాష్ట్రలోని భీవండికి ఉపాధి కోసం వలస పోయిన నేత కార్మికులు తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కొనసాగించడంలో రేవంత్‌రెడ్డి సర్కారు విఫలమైంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది.
తెలంగాణలో జనవరి నుంచి ఇప్పటి వరకు 12 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పుల నష్టపరిహారం చెల్లించాలి. చేనేత కార్మికులకు ప్రయోజనం, పని కల్పించే పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. దీనివల్ల నేత సమాజంలో నిరుద్యోగం, పేదరికం పెరిగి కనీసం మందులు కూడా కొనలేని దీనస్థితిలో నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వక నోటికాడి బుక్కను కాంగ్రెస్ నేతలు ఎత్తగొట్టిన్రు. జనతా వస్ర్తాలు, ఇందిరమ్మ చీరెల పేరుతో అయినా పథకాన్ని కొనసాగించాలి. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినట్టు చేనేత రంగానికి కూడా ఇవ్వాలి. కరెంటు సమస్య, బతుకమ్మ చీరలు, బకాయిలు, మార్కెట్ వసతి కల్పన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర బడ్జెట్లో భారీ బడ్జెట్ కేటాయిస్తామని, నేత కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. దానిని నిలబెట్టుకోని పక్షంలో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతాం.