Cabinet Expansion | రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నది. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బడుగు మంత్రులు,దక్షిణ తెలంగాణ నుంచి ఉన్నత సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై వేటు పడనున్నట్టు సమాచారం. ఐదు రాష్ర్టాల ఎన్నికల తర్వాత మార్పులు ఉండనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొత్తగా ఐదుగురిని క్యాబినెట్లోకి తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నదా? ముగ్గురు మంత్రులను తొలగించడం ఖాయమైందా? ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బడుగు మంత్రులపై తొలగింపు కత్తి వేలాడుతున్నదా? అంటే, అధికార పార్టీ నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తున్నది. మంత్రివర్గంలో మార్పులపై అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అంటే సగం కాలం పూర్తి కావొస్తుండటంతో మంత్రివర్గంలో మార్పులు చేయాలని అధిష్ఠానం నిర్ణయించిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై పెద్దలు ఫోకస్ చేశారని, తీసివేతలు, కూడికల జాబితా కూడా దాదాపు సిద్ధమైందని అంటున్నారు. ఏప్రిల్‌లో ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ చేస్తారని తెలిసింది. మరో నెల లేదా రెండు నెలల్లో రాష్ట్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
ప్రస్తుత క్యాబినెట్‌లోని ముగ్గురు మంత్రులను తొలగించాలని అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. ఇందులో ఇద్దరు ఉత్తర తెలంగాణకు చెందిన బడుగు వర్గాలవారు కాగా, మరొకరు దక్షిణ తెలంగాణ నుంచి ఉన్నత సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తున్నది. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరిలో ఒకరు తమ నోటి దురుసుతో చెడ్డపేరు తెచ్చుకోగా, మరొకరు బూడిదలో కాలేసి అవినీతి మరక అంటించుకున్నారనే చర్చ జరుగుతున్నది. వేటు పడనున్న మరో మంత్రి దక్షిణ తెలంగాణకు చెందిన ఉన్నత సామాజిక వర్గానికి చెందినవారని చెప్తున్నారు. ఇటీవల సదరు మంత్రికి సంబంధించిన వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికితోడు దక్షిణ తెలంగాణకు చెందిన మరో నేత తనకు కచ్చితంగా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన్ని అకామిడేట్ చేయడానికి సదరు మంత్రిని తొలగించాలని నిర్ణయించారని తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ చెందిన ఓ మంత్రిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చించుకుంటున్నారు.
క్యాబినెట్ మార్పుల్లో భాగంగా ముగ్గురు మంత్రులను తొలగించి వారి స్థానంలో మరో ముగ్గురు కొత్త వారిని తీసుకొనే అవకాశం కనిపిస్తున్నది. దీంతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు స్థానాలను సైతం భర్తీ చేయాలని నిర్ణయించారని తెలిసింది. మంత్రివర్గంలో మొత్తం 18కి అవకాశం ఉండగా, ప్రస్తుతం ముఖ్యమంత్రితోపాటు 16 మంది మంత్రులే ఉన్నారు. దీంతో అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తుండటంతో ఆ రెండు ఖాళీలను కూడా భర్తీ చేయాలని అధిష్ఠానం నిర్ణయించిందని సమాచారం. ఇలా మొత్తం ఐదు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉన్నదని తెలిసింది. ఇప్పటికే మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న నేతల జాబితా పెద్దదిగానే ఉన్నది. లంబాడా సామాజికవర్గం నుంచి రామచంద్రనాయక్, బాలునాయక్ పోటీ పడుతున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, సుదర్శన్‌రెడ్డి, లక్ష్మీకాంతరావు, మధన్మోహన్, మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారని తెలిసింది.