గద్వాల, జూన్ 10 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సంతోష్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతోపాటు సభ్యులు ప్రవీణ్, నీలాదేవి, లక్ష్మీనారాయణ, రాంబాబు, శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేసే సమయంలో ప్రజల అభిప్రాయాలు సేకరించారా? గ్రామ సభలు నిర్వహించారా? అని కలెక్టర్‌ను ప్రశ్నించారు.
పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించారు. రాజోళి మండలం నసనూర్ శివారులో సర్వే నంబర్ 35లో తమకు భూమి ఉన్నదని.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తమకు న్యాయం చేయకుండా రాజోళి ఎస్సై కులం పేరుతో దూషించి తనపై తప్పుడు కేసు పెట్టేందుకు యత్నించడంతోపాటు భయభ్రాంతులకు గురిచేశాడని చిన్నధన్వాడకు చెందిన రాజశేఖర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ప్రమాదం పొంచి ఉన్నదని, అందుకే 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకించినా కంపెనీ యాజమాన్యం దాడులకు ప్రేరేపించడంతో పలువురు గాయపడ్డారని, దాడి చేసిన వారిని వదిలి, రైతులపై అక్రమ కేసులు నమోదు చేసిన రాజోళి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సైపై వచ్చిన ఆరోపణలపై విచారణ అధికారిగా గద్వాల డీఎస్పీ మొగులయ్యను నియమిస్తున్నట్టు చైర్మన్ వెంకటయ్య తెలిపారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయితేనే అసలైన పండుగ ;నేడు ఏరువాక పౌర్ణమి పండుగ చేసుకోం
రాజోళి, జూన్ 10: ‘మా గ్రామ శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దయితేనే మాకు అసలైన పండుగ. అప్పటివరకు ఏరువాక పౌర్ణమిని జరుపుకోం’ అని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ గ్రామాల రైతులు తీర్మానించారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో రైతులు సమావేశమయ్యారు. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు ఏ పండుగ కూడా చేసుకోద్దని సమిష్టిగా నిర్ణయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కంపెనీ వద్దంటూ నిరసన తెలియజేసిన తమ గ్రామ ప్రజలను అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపితే, తాము సంతోషంగా పండుగ ఎలా జరుపుకొంటామని ప్రశ్నించారు. అరెస్టయిన వారు విడుదలయ్యాకే తమకు అసలైన పండుగ అని పేర్కొన్నారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులే అని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.