ST Classification | మంచిర్యాల, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో మరో సామాజిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు) కూడా వర్గీకరణకు గళమెత్తుతున్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్, పలు ఆదివాసీ ప్రజాసంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ప్రభుత్వం 15శాతం ఎస్సీ కోటా రిజర్వేషన్లో మాదిగ ఉపకులాలకు 9 శాతం, మాల ఉపకులాలకు 5 శాతం, సంచార జాతులకు ఒక శాతం వర్తింపచేయాలని నిర్ణయించింది. అలాగే ఎస్టీలకు అమలు చేస్తున్న 10శాతం రిజర్వేషన్లను కూడా ఉపకులాల వారీగా, జనాభా ప్రాతిపదికన పంచాలని ఆదివాసీల నుంచి డిమాండ్ వినిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకోవచ్చని 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమ సంఘాల నేతలు రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచారు. దీంతో ప్రభుత్వానికి వర్గీకరణ చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. ఇప్పుడు ఎస్టీలను వర్గీకరించేందుకు కూడా వెంటనే కమిషన్‌ను నియమించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
1996 నుంచి ఉద్యమం.. లంబాడీ, ఆదివాసీ వివాదం
ఎస్టీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో 1996లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ సంఘాలు ఉద్యమం చేపట్టాయి. 2017లో వర్గీకరణ ఉద్యమాన్ని కొందరు నేతలు రాజకీయ స్వప్రయోజనాల కోసం పక్కదారి పట్టించారని విమర్శలు ఉన్నాయి. ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్‌తో కొందరు ఉద్యమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ తరహా ఉద్యమాలు ఎక్కువగా జరిగాయి. ఉద్యమాన్ని పక్కదారి పట్టించిన నేతలు రాజకీయలబ్ధి పొందారని, తమకు న్యాయం జరగలేదని ఆదివాసీలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రజాసంఘాల సమావేశాలు, మేధావుల అంతర్మథనంతో ఉద్యమరూపుపై స్పష్టత వచ్చిందని ఆదివాసీ నేతలు చెప్తున్నారు. లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని కాకుండా ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ నినాదంతో ఉద్యమించనున్నట్టు స్పష్టంచేస్తున్నారు.
వర్గీకరణ ఎలా ఉండాలి? ఆదివాసీల డిమాండ్ ఏంటి?
ఎస్టీలను నాలుగు రకాలుగా వర్గీకరించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని ఎస్టీ జాబితాలో 33 తెగలు ఉన్నాయి. ఇందులో యానాది, ఎరుకల, లంబాడీ అనే మూడు వర్గాలను 1976లో జాబితాలో చేర్చారు. అప్పటివరకు ఎస్టీలకు 4శాతంగా ఉన్న రిజర్వేషన్లను 6 శాతానికి పెంచారు. కానీ 1976లో ఎస్టీల్లో చేర్చిన వర్గాలు అటవీప్రాంతంతో పాటు మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. వారు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నవారు కావడంతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎక్కువ లబ్ధిపొందుతున్నారని ఆదివాసీలు చెప్తున్నారు. అటవీప్రాంతాల్లో జీవించే ఆదివాసీలకు సముచితన్యాయం చేకూర్చేందుకు ఎస్టీలను వర్గీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. 1976లో ఎస్టీల్లో చేర్చిన వర్గాలను ఒకటిగా వర్గీకరించి, మిగిలిన ఆదివాసీ తెగలను మూడు రకాలుగా వర్గీకరించాలని కోరుతున్నారు. పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్(పీవీటీజీ) పరిధిలోని కొలాం, తోటి, మన్నేవార్ తదితర తెగలను ప్రత్యేక గ్రూపుగా, మిగిలిన ఆదివాసీలను ఒక గ్రూపుగా, ఆదివాసీల్లోని సంచార తెగలను మరో వర్గంగా మొత్తం నాలుగు రకాలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కమిషన్‌ను నియమిస్తే ఈ ప్రతిపాదనలను అందజేస్తామని ఆదివాసీ నేతలు చెప్తున్నారు.
మొదలైన ఉద్యమ కార్యాచరణ
ఎస్టీ వర్గీకరణ డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీలు కార్యాచరణను మొదలుపెట్టారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏటూరునాగారంలో 500 మంది ఆదివాసీ మహిళలతో సదస్సు నిర్వహించారు. పాల్వంచ, గూడూర్లోనూ చైతన్య సమావేశాలు ఏర్పాటు చేశారు. గురువారం కూడా పాకాల కొత్తగూడ మోకాలపెల్లిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 17న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సభలో వర్గీకరణ లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తామని ఆదివాసీ నేతలు చెప్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కాంగ్రెస్ సర్కారు వర్గీకరణ చేసి తీరాల్సిందేననే డిమాండ్‌తో పోరాటం ఉంటుందని స్పష్టంచేస్తున్నారు.
కేసీఆర్ పెంచారు.. కాంగ్రెస్ ఏం చేస్తుంది?
2014లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 36,44,453 అంటే 10 శాతంగా ఉన్నారు. నివేదిక ఆధారంగా నాటి సీఎం కేసీఆర్ ఎస్టీల రిజర్వేషన్ పెంచాలని నిర్ణయించారు. 40ఏండ్ల పాటు 6శాతంగా ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారు. విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించారు. అయితే తాజాగా కాంగ్రెస్ సర్కారు చేసిన సర్వేలో రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 37,05,929 అంటే 10.45 శాతం ఉన్నట్టు తేలింది. ఈ లెక్కలపై భిన్నవాదనలు ఉన్నప్పటికీ, మరోసారి ఎస్టీల జనాభాను లెక్కించి జనాభా ప్రతిపాదికన, ఆదివాసీ తెగల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి స్థితిగతులపై అధ్యయనం చేసి, ఎస్టీలను ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఎస్సీల మాదిరే.. ఎస్టీలను వర్గీకరించాలి
ఎస్టీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని 30 ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నాం. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించారు. అదే తరహాలో ఆదివాసీలను వర్గీకరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో 1976 కంటే ముందు నుంచి ఉన్న ఆదివాసీ తెగల జనాభా, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై లోతైన అధ్యయనం చేసి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలి. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా కార్యాచరణతో ముందుకు వెళ్తాం.
– ఆత్రం భుజంగరావు, ఆదివాసీ ఐక్యవేదిక, రాష్ట్ర సలహాదారు
పీవీటీజీలను ప్రత్యేకంగా వర్గీకరించాలి
ఎస్సీల తరహాలోనే ఎస్టీల రిజర్వేషన్లను వర్గీకరించాలి. ఆదివాసీలను, పీవీటీజీ, గిరిజనులను వేర్వేరుగా విభజించి రిజర్వేషన్లను పునర్విభజించాలి. అప్పుడే చెంచు, కోలాం, తోటి తదితర పీవీటీజీ గ్రూపులకు లబ్ధి చేకూరుతుంది. రిజర్వేషన్ల ఫలాలు అందుతాయి. నిధులు దక్కుతాయి. వెరసి పీవీటీజీలు అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది. పీవీటీజీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
– తోకల గురువయ్య, చెంచులోకం తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ
ఎస్టీలను వర్గీకరించాల్సిందే..
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం వాటా ఇస్తున్నది. ఎస్సీ వర్గీకరణతో ఆ వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఎస్టీల్లోనూ అసమానతలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో చాలా మంది ఆదివాసీలకు ప్రాధాన్యం లేదు. ఎస్టీ రిజర్వేషన్ అనేది కొన్ని తెగలకే పరిమితమైంది. ఆర్థికంగా, సామాజికంగా ఆ తెగలే బాగున్నాయి. ఆదివాసీల్లో 33 తెగలుంటే మూడు, నాలుగు తెగలకే రాజ్యాధికారం పరిమితమైంది. 75 ఏండ్లు గడిచినా ఆదివాసీలు ఇంకా వెనుకబడే ఉన్నారు. ఎస్టీ వర్గీకరణ చేస్తేనే వారి జీవితాలు వెలుగులోకి వస్తాయి. ఎస్సీల మాదిరిగానే ఎస్టీ వర్గీకరణ చేసేందుకు వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలి. తుడుందెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లందులో నిర్వహించే బహిరంగ సభలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాం.
– గంజి రాజన్న, ఆదివాసీ నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ, రాష్ట్ర అధ్యక్షుడు