భద్రాద్రి జిల్లాలో ఈ ఎండాకాలం కూడా తాగునీటికి తండ్లాట తప్పేలా లేదు. గత ప్రభుత్వం మీద నీలాపనిందలు మోపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండేళ్లు గడుస్తున్నా కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా తీసుకున్న కనీస చర్యలూ శూన్యం. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎన్ని అబాండాలు మోపినా ఆయన తీసుకొచ్చిన మంచినీటి పథకమే ఇప్పటికీ తాగునీటి అవసరాలను తీరుస్తోంది. అయితే, మధ్యమధ్యలో వచ్చే మరమ్మతులు, కొత్తగా ఇవ్వాల్సిన కనెక్షన్ల వంటి విషయాల్లోనూ కాంగ్రెస్ సర్కారు చొరవ చూపడం లేదు. దీంతో ఈ వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పవనే స్పష్టత వస్తోంది.
-భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 17 (నమస్తే తెలంగాణ)
ఇంటింటికీ శుద్ధజలాలు అందించాలన్న సంకల్పంతో మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిన అపర భగీరథుడు కేసీఆర్.. భద్రాద్రి జిల్లాలోని మూరుమూల పల్లెలకూ వాటిని అందించారు. అయితే, అనుకోకుండా ఎదురైన కొన్ని అవాంతరాల వల్ల కొన్ని గ్రామాలకు నీటిని అందించే అవకాశం కలగలేదు. అయినప్పటికీ ఆయా గ్రామాలకు పైపులైన్లు కూడా వేసి సర్వం సిద్ధం చేసి ఉంచారు. కానీ, కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లు దాటినా కనీసం ఆ పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయలేకపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2,21,394 ఇళ్లకు తాగునీటి నల్లా కనెక్షన్లను గత కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చింది. ఇంకా కేవలం 6,791 ఇళ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది.
వీటిల్లో కూడా ఇటీవల నిర్మించుకున్నవి కూడా చాలా ఉన్నాయి. అయితే, ఆ ఇళ్లకు కూడా నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. పైగా, ఇప్పటికే ఉన్న మిషన్ భగీరథ పథకాన్ని కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. పైపులైన్లు పగిలిన చోట్ల మరమ్మతులు చేపట్టడం లేదు. ట్యాంకులకు మరమ్మతులు చేయాల్సిన చోట చేయడం లేదు. కొన్నిచోట్ల కేవలం పైపులైన్లను మాత్రమే వేసిన ప్రభుత్వం.. కనీసం వాటికి కనెక్షన్లు కూడా ఇవ్వకుండా చేతులు దులుపుకుంది. దీంతో అవకాశం ఉన్న చోట కూడా ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. మరికొన్ని చోట్ల సరైన నిర్వహణ లేకపోవడంతో పైపులైన్లు లీకవుతున్నాయి. ఆ నీరంతా మురుగు కాలువల్లో కలుస్తోంది.
పేరుకే నల్లాలు.. నీళ్లు వదిలేదే లేదు..
మిషన్ భగీరథ పథకం ప్రారంభంలోనే అప్పటి ప్రభుత్వం దాదాపుగా జిల్లాలోని అన్ని ఇళ్లకూ పైపులైన్ల వేసి నల్లాలు బిగించి కనెక్షన్లు ఇచ్చింది. కొన్ని అవాంతరాల వల్ల అప్పట్లో నల్లాలు బిగించిన చోట కనెక్షన్లు ఇవ్వడం వీలు కాలేదు. అయితే, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ అవాంతరాలను అధిగమించి నల్లాలకు కనెక్షన్లు ఇస్తే ప్రతి ఇంటికీ శుద్ధజలాలు అందే అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఏ మాత్రమూ చర్యలు తీసుకోవడం లేదు. రెండేళ్లు గడిచిపోయినా నల్లాలకు పైపులైన్లు బిగించలేదు. దీంతో చాలామంది లబ్ధిదారులు తమ ఇళ్లలోని నల్లాలను తిప్పినా నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అయితే, కొన్ని ఊళ్లలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంకులకు, గ్రామంలోని పైపులైన్లకు మరమ్మతులు ఏర్పడ్డాయి. అలాంటి చోట్ల వాటికి మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. ట్యాంకులకు నీళ్లు ఎక్కించే పరిస్థితి లేదు. ట్యాంకుల నుంచి ఇళ్లకు వదిలే పరిస్థితీ లేదు.
కొత్తగూడెంలోనూ తాగునీటి కష్టాలే..
కాంగ్రెస్ పాలనలో కొత్తగూడెం నగరంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. రామవరం పంజాబ్గడ్డ ప్రాంతంలో చేతి పంపులు పనిచేయడం లేదు. ఉన్న పైపులైన్లకు నీళ్లు అందడం లేదు. ట్యాంకుల నిర్మాణం చేసినా వాటికి అంతంత మాత్రంగానే నీటి సరఫరా చేస్తున్నారు. పైపులైన్ల ద్వారా వచ్చే నీటిని అక్కడి ప్రజలు బేసిన్లతో పట్టుకోవాల్సిన పరిస్థితి.
ఆ గ్రామాలకు నీళ్లు అందేనా?
కొన్ని అనివార్య కారణాల వల్ల గత ప్రభుత్వం కొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందించే అవకాశం కలగలేదు. కొంత వెలుసుబాటు చూసుకొని తదుపరి పదవీ కాలంలో అక్కడ మిషన్ భగీరథ నీళ్లు అందించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్ట కార్యాచరణతోనే ఉంది. కానీ, రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ గ్రామాలకు నీళ్లు అందించే పనులను అక్కడే నిలిచిపోయాయి. అక్కడి ప్రజలకు శుద్ధజలాలు సరఫరా చేసేందుకు కొత్త ప్రభుత్వం కనీస చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఇంకా 14 గ్రామాలకు భగీరథ నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ములకలపల్లి మండలం ఉచ్చలబండి గ్రామానికి ఇప్పటికీ తాగునీరు అందడంలేదు. ఆ గ్రామానికి మిషన్ భగీరథ పథకం మంజూరైనా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. గొత్తికోయల గ్రామాలకు సోలార్ ద్వారా మోటర్లు పెట్టినా అందరూ ఒక చోటకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. టేకులపల్లి మండలం చింతోనిచెలక గ్రామ పరిధిలో సర్వాయిబోడు గ్రామానికి ఇప్పటికీ మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదు. గ్రామస్తులు చాలాసార్లు అధికారులు చుట్టూ తిరిగాక ఇటీవలే బోరు వేశారు. నీళ్ల సంగతి మరిచారు. ఇంకా పలు గ్రామాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నా ప్రసుత్త ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోవడం లేదు.
మండల కేంద్రంలో తాగునీరు లేదు..
మాది మారుమూల పల్లెకాదు మాది. మండల కేంద్రమే. పైపులైను వేశారు. కానీ, అందులోంచి నీరు రావడం లేదు. ఎందుకని అధికారులను అడిగితే వారి నుంచి సమాధానం లేదు. పైఅధికారులకు మాత్రం టేకులపల్లి మండలంలో నీరు వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక పల్లెల పరిస్థితి ఎలా ఉంటుందో వెళ్లి చూస్తే అర్థమవుతుంది. వేసవి వస్తే మాకు చాలా ఇబ్బందే. దప్పిక తీర్చుకోవడం కోసం బయటి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.
-జాటోత్ నెహ్రూ, టేకులపల్లి
అన్నింటికీ సింగరేణి నీళ్లే..
రామవరం ప్రాంత ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రానేరాదు. బోర్లు వేస్తున్నామని చెబుతున్నా అవి పని చేయడం లేదు. భగీరథ పైపులైన్లు వేశారు కానీ, నీరు చాలా నెమ్మదిగా వస్తోంది. నల్లాలు కూడా లేవు. పైపు వద్దకు వెళ్లి పట్టుకుంటే ఎప్పటికో బిందె నిండాలి. అందుకే సింగరేణి పంపు దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకోవాల్సి వస్తోంది. మున్సిపల్ కమిషనర్ మా సమస్యను పట్టించుకోవడం లేదు.
-మోరే రూప, మున్సిపల్ మాజీ కౌన్సిలర్, రామవరం
కొన్ని చోట్ల సమస్యలున్నాయి..
మిషన్ భగీరథలో అన్నీ పక్కాగా అయిపోయాయని చెప్పలేము. జిల్లాలో 14 గ్రామాలకు భగీరథ నీరు అందడం లేదు. కొన్ని చోట్ల గ్రిడ్ సమస్య ఉంది. మరికొన్ని చోట్ల మరమ్మతులు కూడా ఉన్నాయి. పట్టణ పరిధిలో కమిషనర్లు చూసుకుంటారు. టేకులపల్లి మండల కేంద్రంలో నీరు వస్తుందని మా సిబ్బంది చెప్పారు. చింతోనిచెలకలో బోరు వేశాం. భగీరథ అక్కడ లేదు. గొత్తికోయల గ్రామాల్లో అటవీ శాఖ సమస్య ఉంది. కొన్నిచోట్ల సోలార్ ద్వారా తాగునీరు అందుతోంది.
-తిరుమలేశ్, మిషన్ భగీరథ ఈఈ, భద్రాద్రి
జిల్లాలో మిషన్ భగీరథ లెక్కలివే..
ఇంటింటికీ ఇచ్చిన నల్లాలు: 2,21,374
ఇంకా ఇవ్వాల్సిన నల్లా కనెక్షన్లు: 6,791
మొత్తం చేతిపంపులు: 6,967
మరమ్మతుల్లో ఉన్నవి: 138
సింగిల్ ఫేజ్ మోటర్లు: 1,004
రిపేర్లు ఉన్నవి: 33
త్రీఫేజ్ మోటర్లు: 833
రిపేర్లు ఉన్నవి: 27