కరీంనగర్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మరో ప్రాజెక్టు పరిధిలోని రైతులకు కష్టాలను తెచ్చిపెట్టింది. ఉత్తర తెలంగాణ వరదాయినిలా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్వహణాలోపంతో చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు నెలకొన్నాయి. నీరందక ప్రాజెక్టు జోన్-1, జోన్-2 పరిధిలో యాసంగి పంటలు ఎండుముఖం పట్టాయి. చెరువులను నింపే బాధ్యతను ప్రభుత్వం విస్మరించిన కారణంగా ఉత్తర తెలంగాణ పరిధిలోని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో జనవరి నెలలోనే 80 శాతం చెరువులు అడుగంటిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే దాదాపు 2,000 చెరువులను నింపే దిశగా చర్యలు తీసుకోకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిరుడు ఆగస్టు మాసంలోనే పూర్తిస్థాయిలో నిండింది. అక్టోబర్ వరకు ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి నీరు వచ్చి చేరుతూనే ఉన్నది.
ప్రాజెక్టు సామర్థ్యం కంటే మూడు రెట్లు నీరు రావడంతో గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టులోకి వచ్చి చేరిన నీటితోపాటు, వర్షాధారితంగా చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకోవడంతో వానకాలంలో ప్రాజెక్టు పరిధిలోని పంటలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. యాసంగిలో సర్కార్ నిర్వహణాలోపంతో రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. యాసంగిలో జోన్-1, జోన్-2 పరిధిలో ఉన్న నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పరిధిలో 4,42,920 లక్షల ఎకరాల పంటలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. డిసెంబర్ 25న జోన్ 2కు కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. గత జనవరి 2న జోన్ 1కి నీటి విడుదల చేశారు.
ఏప్రిల్లో నీటి విడుదల నిలిపివేత?
నీటి విడుదల ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారం వరకే కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్తున్నారు. ఏప్రిల్ 2 నాటికి జోన్-2కు, ఏప్రిల్ 9 నాటికి జోన్-1 పరిధి ఆయకట్టుకు నీటి విడుదల గడువు ముగుస్తుందని చెప్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలో యాసంగి నార్లు పోయడం ఆలస్యమైంది. జనవరి చివరి వారం వరకు నార్లు పోస్తూనే వచ్చారు. చివర్లో నాట్లేసిన రైతులకు ఏప్రిల్ చివరి వారం నుంచి మే మొదటి రెండు వారాల్లో పంటలు కోతకు వస్తాయి. ఏప్రిల్ 9 నాటికే వారబందీ ప్రకారం నీటి విడుదల ప్రక్రియ నిలిచిపోతే తమ పంటల పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వారబంధీ కారణంగా చివరి భూములకు నీరే అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. జోన్-1, జోన్-2 పరిధిలో ఉన్న గొలుసుకట్టు చెరువులు, కుంటలను ప్రాజెక్టు నీటితో నింపే ప్రక్రియ చేపట్టకపోవడంతో పంటలు ఎండుతున్నాయి.
రైతులకు తప్పని సాగునీటి తిప్పలు
వారాబందీ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతున్న జోన్-1, జోన్-2 పరిధిలోని రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. కాలువల నిర్వహణ సరిగా లేక, చాలా చోట్ల మోటర్లతో నీటి చౌర్యంపై అధికారుల నిఘా సరిగా లేక డిస్ట్రిబ్యూటరీల చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందడం లేదు. జోన్-1 పరిధిలో ఉన్న జగిత్యాల జిల్లాలోనే వివిధ డిస్టిబ్యూటరీల చివరి ప్రాంతాలకు నీరు అందడం లేదు. జోన్-2 పరిధిలోని వెల్గటూర్ తదితర మండలాల్లోని వివిధ గ్రామాలకు ప్రాజెక్టు నీరు చేరడం లేదు. దీనికి తోడు కాకతీయ ప్రధాన కాలువతోపాటు, డిస్టిబ్యూటరీ కాలువలకు చాలాచోట్ల లైనింగ్ లేక, పిచ్చిమొక్కలు మెలిచి కాలువలు ధ్వంసమయ్యాయి.