హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ‘మీకు ఉద్యోగావకాశాలు ఇప్పించిందే కాంగ్రెస్. మేం అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే మిమ్మల్ని సచివాలయానికి పిలిచి సగౌరవంగా సంఘాలతో కూర్చుని మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం’ ఇదీ 2023 సెప్టెంబర్ 13న హనుమకొండలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల ధర్నానుద్దేశించి నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ. ‘సమగ్ర శిక్షా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు.
నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పరిష్కారం కాదు’ ఇది 2024 జనవరి 3న సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీ ఆవిష్కరణలో సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు.
ప్రతిపక్షంలో ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారంటూ రేవంత్ వైఖరిపై ఎస్ఎస్ఏ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఏడాది తిరగగా నే సీఎం హోదాలో రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికలకు ముందు 2023 సెప్టెంబర్ 13న హనుమకొండలో సమగ్రశిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరానికి వచ్చి ఇచ్చిన హామీని మరిచారా? అంటూ సీఎంను వారు నిలదీస్తున్నా రు. దాటవేత ధోరణిని ప్రదర్శించడం తప్పించుకోవడమే అవుతుందని మండిపడుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తమను చర్చలకు పిలిపిస్తే పరిష్కారమార్గాలను చూపెడతామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి, అనిల్‌చారి, దుర్గం శ్రీనివాస్, సురేందర్, సహదేవ్, శ్రీధర్‌రెడ్డి, జానకిరామ్, మహేందర్, రమేశ్, బిందుశ్రీ, అమృత, సంధ్యారాణి, జయశ్రీ తదితరులు కోరారు.