హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఆదాయం లేదు.. డబ్బుల్లేవు.. జీతాలివ్వలేమంటున్న కాం గ్రెస్ సర్కారు ఉన్న నిధులను ఖర్చు చేయలేక రాష్ర్టాన్ని తిరోగమన దిశలో నడుపుతున్నది. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించలేకపోతున్నది. కేంద్రం వాటా నిధులకు తోడు, రాష్ట్రవాటా నిధులను సకాలంలో విడుదల చేయడంలేదు. ఫలితంగా 2025-26 విద్యాసంత్సరం బడ్జెట్ ఆమోదం కోసం ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన సమగ్రశిక్ష ప్రాజెక్ట్(ఎస్ఎస్ఏ) అప్రూవల్బోర్డు సమావేశం లో కేంద్రం రూ. 273 కోట్లకు కోతపెట్టింది. 2024-25 విద్యాసంవత్సరం రూ.1,913 కోట్ల బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం తెలుపగా, 2025-26 విద్యా సంవత్సరానికి మాత్రం రూ. 1,640 కోట్ల సీలింగ్ విధించింది.
రాష్ట్రం నిధులివ్వకపోవడంతోనే..
ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను ఖర్చుచేస్తాయి. 2024-25లో ఆమోదించిన రూ.1,913 కోట్లల్లో.. రూ. 1,148.34 కోట్లు కేంద్రం వాటాగా, రూ.765 కోట్లు రాష్ట్ర వాటాగా ఖర్చుచేసేందుకు ఆమోదం తెలిపాయి. కేంద్రం మూడు ఇన్స్టాల్మెంట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు ఇన్స్టాల్మెంట్ల నిధులను మాత్రమే విడుదల చేసింది. మూడో ఇన్స్టాల్మెంట్గా కేంద్రం రూ. 242కోట్లను విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.161కోట్లను ఆఖరు వరకు విడుదల చేయలేదు. పైగా నాలుగో ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేసినా వాడుకోలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో బడ్జెట్‌కు కేంద్రం కోతపెట్టింది.