హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి డిసెంబర్ కోటా టికెట్లు నేడు(బుధవారం) విడుదలకానున్నాయి. ఉదయం 10గంటలకు ఆన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనున్నది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 18న ఉదయం10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ టీటీడీ పేర్కొన్నది. 21న ఉదయం 10గంటలకు ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే అంగప్రదక్షిణ టోకెన్లను 23న ఉదయం 10గంటలకు విడుదల చేస్తామని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. 24న ఉదయం 11గంటలకు రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల కోటాను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈనెల 27వ తేదీ ఉదయం గంటలకు విడుదల చేయనున్నారు.