Srisailam | శ్రీశైలం : శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆలయ ఈవో డి పెద్దిరాజు అన్ని విభాగాలను ఆదేశించారు. పరిపాలనా కార్యాలయంలోని సమావేశంలో మందిరంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ కార్యనిర్వహణ అధికారిణి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అన్ని శాఖల అధిపతులు, ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. వర్షాల వల్ల పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు తాగే నీటిలో కలవకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై వర్షపు నీరు నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా మ్యాన్హోల్స్పై బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద ప్రమాదాలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా యాత్రికులకు దేవస్థానం డార్మిటరీలందు ఉచిత వసతి కల్పించాలని సూచించారు. ఈ ఉచిత వసతి కల్పన గురించి యాత్రికులకు తెలిసే విధంగా దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా నిరంతరం తగు సూచనలు చేయాలన్నారు. అధికారులందరూ పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని ఈవో ఆదేశించారు.