Srisailam | ఒక్కటి మాత్రం నిజం. 2029 దాకా రేవంత్ ప్రభుత్వమే కొనసాగితే..తెలంగాణ నీళ్లన్నీ ఏపీకి ధారాదత్తం కావడం ఖాయం. రేవంత్ సర్కార్ ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది. ఇటు గోదావరి నీళ్లు బనకచర్ల, నల్లమల ప్రాజెక్ట్‌కు అర్పించింది. 45 టీఎంసీల పాలమూరు నీళ్ల వాటా వదులుకున్నది. ఇవి చాలవనట్టు ఇప్పుడు పాలమూరుకు జూరాలే కరెక్ట్ అంటూ కొత్త రాగం అందుకున్నది. దీని వెనుక మతలబేంది?
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్ట్‌లకు జూరాలను కేంద్రం చేయడంలోని కుట్రను పసిగట్టారు కాబట్టే కేసీఆర్ పాలమూరు పంప్‌లను శ్రీశైలం వద్ద ఏర్పాటు చేశారు.తెలంగాణకు హక్కుభుక్తంగా రావాల్సిన వాటాను వాడుకునేలా.. పాలమూరు- రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు అడ్డం పడాలని విశ్వప్రయత్నం చేసిన ఏపీ బాబులు విఫలమయ్యారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రాగానే మళ్లీ ఆ కుట్రల కత్తులకు పదును పెడుతున్నారు. అందులో భాగమే ఈ జూరాల రాగం! నీళ్ల మంత్రి ఏం వాదిస్తున్నారు? పాలమూరు ప్రాజెక్టుకు జూరాలే కరెక్టు అట! అసలు జూరాల కెపాసిటీ ఎంత? నీటి సోర్స్ ఏమిటి? కనీస అవగాహన ఉన్నదా? పూడిక పోను జూరాల సామర్థ్యం 6 టీఎంసీలు! శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు! పైగా అందులో కృష్ణాతో పాటు తుంగభద్ర, భీమా నదులు కలుస్తాయి.బుద్ధి ఉన్నవారెవరైనా ఒక భారీ ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నీటిని వాడాలి? 215 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచా? 6 టీఎంసీల బరాజ్ నుంచా?
ఏపీ ప్రభుత్వం తన పథకాలన్నింటికీ నీటిని ఎక్కడినుంచి తీసుకుంటున్నది? పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, హంద్రీనీవా, మల్యాల,
మచ్చుమర్రి వంటి అన్ని ప్రాజెక్టులకూ శ్రీశైలంనుంచే ఎందుకు తీసుకుంటున్నది? తెలివితక్కువై తీసుకుంటున్నదా? ఎక్కడ నికార్సైన నీటి లభ్యత ఉన్నదో తెలుసు కాబట్టి. ఆ తెలివిడి లేదు కాబట్టే రేవంత్ సర్కార్ జూరాల అంటున్నది.
హైదరాబాద్‌కు పక్కనే ఉన్న 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్‌ను కాదని, దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామని ఇదే రేవంత్ సర్కారు ప్రతిపాదించింది. ఎందుకు? మల్లన్న సాగర్‌లో 50 టీఎంసీల నీళ్లు ఉన్నాయని! మరి ఇదే సూత్రం జూరాల-శ్రీశైలానికి ఎందుకు వర్తించదు? ఎందుకంటే ఏపీ బాబు కాలనాగులా పొంచి ఉన్నడు గనుక! తెలంగాణకు ద్రోహం అనే కాలకూట విషం కాంగ్రెస్ సర్కార్ కడుపులో దాగి ఉన్నది గనుక!
తెలంగాణ ముఖ్యమంత్రికి, నీళ్ల మంత్రికి ఏ ప్రాజెక్టు నిల్వ కెపాసిటీ ఎంతో తెల్వది. నీటి సబ్జెక్టు అసలే తెల్వది. భవిష్యత్తు మీద దృష్టి లేదు. రాష్ట్రం మీద బాధ్యతా లేదు. పాలమూరు ప్రాజెక్టుకు వాడే నీటి పంపుల కెపాసిటీ ఎంత? తెలిసే మాట్లాడుతున్నరా? అంత భారీ పంపులు వాడితే జూరాల ఖాళీ కావడానికి పట్టే సమయమెంత? శ్రీశైలంలో ఎంత నీటిని, ఎన్ని రోజులు తోడుకోవచ్చు? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లివ్వవచ్చు? అసలు జూరాలకు ప్రస్తుతమున్న పథకాలన్నింటికైనా నీరు సరిపోతున్నదా? ఏదీ అవగాహన లేదు. అయినా పక్క రాష్ట్రం ఎత్తుకు పోయిన నీటికి మంగళారతులు పట్టిన కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలన్న సోయి ఉంటదా? బరాజ్‌లు వదిలి కాలువలు తవ్వి కమీషన్లు దండుకునే నేతలకు బాధ్యత ఉంటదా? కప్పాలు కట్టడం..గప్పాలు కొట్టడం తప్ప!-మ్యాకం రవికుమార్)
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు నీరు దక్కకుండా ఉమ్మడి పాలకుల నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఏపీకి నీటిని తరలించే ప్రాజెక్టులన్నింటికీ 215 టీఎంసీల నీరు నిల్వ ఉండే శ్రీశైలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సోర్స్‌గా పెట్టారు. తెలంగాణకు మాత్రం నీటిలభ్యత ఎక్కువగా లేని జూరాలను సోర్స్‌గా పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రీ డిజైనింగ్ ద్వారా ఈ కుట్రలను అడ్డుకున్నది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నాటి కుట్రలను కొనసాగిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సోర్స్‌ను కేసీఆర్ ప్రభుత్వం జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంతో నష్టం జరిగింది. కృష్ణా, తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించగానే నీళ్లను ఒడిసిపట్టి ఉంటే బాగుండేది. తద్వారా మనం వదిలాకే ఏపీ వాళ్లు నీళ్లు తీసుకోవాల్సి వచ్చేది’ అని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తున్నది. వాస్తవానికి కృష్ణాబేసిన్ లోటులో ఉంటుం ది. ఇక్కడ వరద వచ్చేదే అడపాదడపా. వరద వచ్చిన వెంటనే తెలంగాణకు నీళ్లిచ్చేలాప్రాజెక్టుల సోర్స్ మొత్తాన్ని జూరాల కేంద్రంగానే పెట్టారని అనుకుందాం.
మరి నీటిని ఒడిసిపట్టాలంటే నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు కూడా కట్టాలి కదా? తక్కువ సమయంలో వరదను ఎత్తిపోసుకునే సామర్థ్యం గల పంపులను పెట్టాలి కదా? మరెందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నది నిపుణుల ప్రశ్న. విస్తృతంగా వరద వచ్చిన సందర్భాల్లో ఒడిసిపట్టినా.. వరద రోజులు ముగిసిన తర్వాత పరిస్థితి ఏమిటి? ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి? అనే ప్రశ్నలకు పరిష్కారం ఎందుకు చూపలేదు. మరి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు మళ్లించే ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టును సోర్సుగా ఎందుకు పెట్టింది? తెలంగాణకు కృష్ణా నీళ్లు దక్కకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఇలా వ్యవహరించిందని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ఆ కుట్రలపై కేసీఆర్ గర్జించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, వాటిని ఛేదించేందుకు ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టు సోర్స్‌ను శ్రీశైలానికి మార్చారు. ఉమ్మడి పాలకుల కుట్రలకు చెక్ పెట్టారు. పాలమూరుకు నీటి భరోసాను కల్పించారు. కనీసం ఆ మాత్రం సోయి లేకుండా, ఉమ్మడి రాష్ట్ర పాలకుల ప్రణాళికలకే సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంతపాడటంలో మర్మమేమిటన్న చర్చ జరుగుతున్నది. శ్రీశైలం సోర్స్‌గా గ్రావిటీ ద్వారా కొడంగల్, నారాయణపేటలో రెట్టింపు ఆయకట్టుకు నీరించే పనులను రద్దు చేయడం, భీమా నీటి కోటాకే కోత పెట్టి జూరాల నుంచే లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతుండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జూరాల పరిస్థితి ఇదీ!
జూరాల అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాదు. కేవలం ఒక బరాజ్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత దుర్భర స్థితిని చూడలేక బచావత్ ట్రిబ్యునల్ స్వతహాగా కల్పించుకుని మానవీయ కోణంలో జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీల నికర జలాలు కేటాయించింది. ఆ మేరకు 30 టీంఎసీల నిల్వ సామర్థ్యంతో జూరాల వద్ద ప్రాజెక్టును నిర్మిస్తే జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధిక ప్రాంతాలకు గ్రావిటీ ద్వారానే సాగునీటిని అందించే అవకాశం ఉండేది. కానీ, ఉమ్మడి పాలకులు ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కుట్రపూరితంగా జూరాల ఎగువన రావులపల్లికి మార్చారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని 11.94 టీఎంసీలకు కుదించారు. అయినా ఆ మేరకు నీటిని నింపితే కర్ణాటకలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. దీంతో ఆ రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఫలితంగా ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసినా 9 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి కల్పించారు. పూడిక చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ 6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతిపాదిత లక్ష ఎకరాలకు కూడా నీరందించలేక, అప్పుడప్పుడూ క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి నెలకొన్నది.
తెలంగాణ ప్రాజెక్టులన్నీ అక్కడే
జూరాల దిగువన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నది. కృష్ణా ప్రధాన నదితో, తుంగభద్ర, ఆ తర్వాత భీమా నదులు ఈ ప్రాజెక్టు ఎగువన కలుస్తాయి. వెరసి నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. అదీగాక శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, అందులో దాదాపు 160 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉన్నది. ఇది ఉమ్మడి పాలకులకు తెలియంది కాదు. ఏపీ ప్రాంతానికి నీటిని అందించే హెచ్ఎన్ఎస్ (హంద్రీనీవా సుజల స్రవంతి), టీజీపీ (తెలుగుగంగా ప్రాజెక్టు), మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ తదితర వాటన్నింటినీ శ్రీశైలం ప్రాజెక్టు నీటి ఆధారంగానే నిర్మించారు. కానీ, అందుకు భిన్నంగా తెలంగాణ ప్రాంతానికి నీటిని అందించే ప్రాజెక్టులన్నింటినీ అనేక చిక్కుల్లో ఉండి, నీటిని నిల్వ చేయని స్థితిలో ఉన్న జూరాల కేంద్రంగానే ప్రతిపాదించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మినహా రాజీవ్ భీమా లిఫ్ట్ 20 టీఎంసీలు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ 3.90 టీఎంసీలు, 22 టీఎంసీల వరద జలాల ఆధారంగా రూపొందించిన నెట్టెంపాడును కూడా జూరాల నుంచే ప్రతిపాదించారు.
అందుకు కారణం ఒక్కటే. తెలంగాణకు కృష్ణా నీళ్లు దక్కకూడదనే ఉమ్మడి పాలకుల కుట్ర తప్ప మరేమీ లేదు. ఆ కుట్రలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి కూడా ఆ ప్రాజెక్టుల నిర్మాణ పనులను పూర్తి చేయలేదు. ఇదిలా ఉంటే, కృష్ణాలో వరద వచ్చేదే గరిష్ఠంగా 30 రోజులు. ఇదీ ఉమ్మడి ఏపీ పాలకులే వాదించారు. ఆ కారణంతోనే పోతిరెడ్డిపాడును విస్తరించారు. మరి ఆ వరద వచ్చిన సమయాల్లోనే తెలంగాణ ప్రాజెక్టులకు కావాల్సిన నీటిని ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అంతే. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 11.84 టీఎంసీలు కాగా, ఆ ప్రాజెక్టు కేంద్రంగా ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు కావాల్సిన నీళ్లు 41.74 టీఎంసీలు. ఇక వరద జలాల ఆధారంగా నిర్మించిన నెట్టెంపాడుకు మరో 22 టీఎంసీలు. మొత్తంగా ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోవాల్సింది 63.74 టీఎంసీలు. సూటిగా చెప్పాలంటే జూరాలలో నీటిని నిల్వ చేయలేం. తప్పక కిందికి వదలాల్సిందే. మరి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో నీటిని ఎత్తిపోసుకునేలా అయినా ప్రాజెక్టులను రూపొందించారా? అంటే అదీలేదు. స్వల్ప రేటింగ్ ఉన్న పంపులను ప్రతిపాదించారు. వాటినైనా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించకుండా రెండు లేదా మూడుతో సరిపెట్టారు. సాధారణంగా ఎత్తిపోతల పథకాల్లో ఎప్పుడూ ఒక స్టాండ్‌బై పంపును అమర్చుతారు. అనివార్య కారణాలతో ఎప్పుడైనా ఒక పంపు మరమ్మతుకు గురయితే మరో పంపుతో నీటిని లిఫ్ట్ చేయడానికి. కానీ, ఉమ్మడి పాలకులు కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో తొలుత స్టాండ్ బై పంపు ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చి ఆ తర్వాత రద్దు చేశారు. కేవలం రెండు పంపులనే ఏర్పాటు చేసి పాలమూరుకు నీళ్లు దక్కకూడదనే తమ కుట్రలను అమలు చేశారు.
ఏపీ కుట్రలకే రేవంత్ సర్కార్ వత్తాసు
హైదరాబాద్ నీటి అవసరాలను కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి తీర్చేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ ప్రణాళికలను మార్చింది. కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా నీటి సోర్సును మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు మార్చింది. అదేమంటే మల్లన్నసాగర్ 50 టీఎంసీలు ఉంటాయని, నీటి భరోసా ఉంటుందని వెల్లడించింది. కానీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్.. తక్కువ నీటినిల్వ సామర్థ్యమున్న జూరాల నుంచి ఎక్కువ నీటినిల్వ సామర్థ్యమున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పాలమూరు ప్రాజెక్టును మార్చడాన్ని తప్పుబడుతున్నది. ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగా ఎంపిక చేసిన జూరాలనే సరైనదని రేవంత్‌రెడ్డి సర్కార్ వంతపాడుతున్నది. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. జూరాల నుంచి సోర్స్‌ను అనవసరంగా శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారని పదేపదే విమర్శిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ఏలికలు కుట్రపూరితంగా, కృష్ణా జలాలు తెలంగాణకు దక్కకుండా చేసిన ప్రతిపాదనలే భేష్ అంటూ కితాబిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పగించేందుకేనా?
రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలన్నీ శ్రీశైలం ప్రాజెక్టును గంపగుత్తగా ఏపీకి అప్పగించేందుకు నిర్ణయించుకున్నట్టు అనిపిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. మక్తల్-కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను చేపట్టేందుకు ఉరకలేస్తుండటమే ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఆ మూడు నియోజకవర్గాలకు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉన్నది. కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి, దౌల్తాబాద్, బొమ్రాస్పేట, కొడంగల్, మద్దూరు కలిపి 110 గ్రామాలకు తాగు, 1,17,136 ఎకరాలకు సాగునీరు, నారాయణపేట నియోజకవర్గంలో కోయిల్‌కొండ, నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద, మరికల్ మండలాల్లో 89 గ్రామాలకు తాగునీరు, 63,382 ఎకరాలకు సాగునీరు, మక్తల్ నియోజకవర్గంలో మక్తల్, ఉట్కూర్, నర్వ మండలాల్లో 45 గ్రామాలకు తాగునీరు, 66,936 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధంచేశారు.
మొత్తంగా 2.5 లక్షల ఎకరాలకు నీరందించేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కాలువల నిర్మాణానికి సైతం సిద్ధమైంది. కానీ, రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆ టెండర్లను రద్దు చేశారు. మళ్లీ జూరాల నుంచే, అదీ ఎత్తిపోతల ద్వారా నారాయణపేట, కొడంగల్‌కు కేవలం లక్ష ఎకరాలకే నీరందించాలని నిర్ణయించింది. అది కూడా భీమా ప్రాజెక్టుకు కేటాయించిన 20 టీఎంసీల నుంచి 7.23 టీఎంసీలను కోత పెట్టి ఆ లిఫ్ట్ స్కీమ్‌కు కేటాయించింది. తాజాగా మక్తల్ నియోజకవర్గంలో మరో 50 వేల ఎకరాలను కూడా లిఫ్ట్ స్కీమ్‌కు జోడించింది. ఇప్పటికే జూరాలపై 5.48 లక్షల ఆయకట్టు భారం ఉన్నదంటే, దానిపై అదనంగా 1.5 లక్షల ఆయకట్టు భారాన్ని కాంగ్రెస్ మోపుతుండటం గమనార్హం. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుపై చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి పనులను నిలిపివేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 90 శాతం పనులు పూర్తికాగా, మిగతా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేసి వినియోగంలోకి తేవాల్సిందిపోయి పడావు పెట్టింది. ఇవన్నీ పరిశీలిస్తే శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా ఏపీకి కట్టబెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు అనిపిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
కేసీఆర్ రీడిజైన్‌తోనే కుట్రలన్నీ పటాపంచలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా తొలుత జూరాల నుంచే ఉమ్మడి ఏపీ పాలకులు ప్రతిపాదించారు. ఉద్యమ సమయంలోనే ఏపీ కుట్రలపై గర్జించిన కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. శ్రీశైలంను ఇన్‌టేక్ పాయింట్‌గా పెట్టారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జూరాల దిగువన శ్రీశైలం ఉన్నది. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు. డెడ్ స్టోరేజీ వరకు నీరు అందుబాటులో ఉంటుంది. ఎగువన కృష్ణా నుంచి జలాలు నామమాత్రంగా వచ్చినా కూడా తుంగభద్ర తదితర జలాలు కూడా శ్రీశైలం డ్యామ్‌కే చేరుతాయి. పూర్తిగా నీటి భరోసా ఉంటుంది. వరదల సమయంలోనే కాదు అనంతరం కూడా నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా తెలంగాణ ప్రయోజనాల నేపథ్యంలో ప్రాజెక్టు సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు మార్చారు. పోతిరెడ్డిపాడు ద్వారా పొరుగున ఏపీ కృష్ణా జలాలను తన్నుకుపోకుండా పోటీగా పాలమూరును డిజైన్ చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 798 అడుగుల నుంచి కూడా నీటిని తీసుకునేలా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను తీర్చిదిద్దారు. ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేసి ఉమ్మడి పాలకులు గతంలో చేసిన కుట్రలన్నింటినీ ఛేదించారు. అంతేకాదు 145 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రపంచంలోనే అతి భారీ మోటర్లను ప్రాజెక్టులో మొత్తంగా 8+1 ఏర్పాటు చేయడం ద్వారా నికరంగా రోజుకు 24 వేల క్యూసెక్కులను (2 టీఎంసీలను) ఎత్తిపోసుకునేలా రూపొందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కృష్ణా నీళ్లపై పూర్తి భరోసా కల్పించారు. మరోవైపు జూరాలపై భారం తగ్గి, ఇప్పటికే సామర్థ్యానికి మించి ఏర్పాటుచేసిన ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం వాటిల్లదు.
నీటివాటాలపైనా పూటకో మాట
ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో కేటాయించిన 1,005 టీఎంసీలతోపాటు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు మొత్తం 1,050 టీఎంసీలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయడంతోపాటు, ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ట్రిబ్యునల్-1 కేటాయించిన కృష్ణా జలాల్లో 75శాతం డిపెండబులిటీ కింద 555 టీఎంసీలు, 65శాతం డిపెంబులిటీ కింద 575 టీఎంసీలను కేటాయించాలని బీఆర్ఎస్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నది. మొత్తంగా 71 క్యాచ్మెంట్ ఏరియా, బేసిన్‌లోని నివసించే జనాభా, దుర్భిక్ష ప్రాంతాల ఆధారంగా మొత్తంగా 1,050 టీఎంసీల కృష్ణా జలాల్లో మొత్తంగా 789 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సి ఉంటుందని వాదిస్తున్నది.
అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఈ నీటివాటాలపై ఏమాత్రం అవగాహన లేకుండా పోయింది. ఇష్టారీతిన ప్రకటనలు చేస్తూ తెలంగాణ జలహక్కులను ప్రమాదంలో పడేస్తున్నారు. గత జూన్ 19న కృష్ణాలో 500 టీఎంసీలను తెలంగాణకు రాసిస్తే చాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీలు దక్కుతాయంటూ ప్రకటించి అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. గత సెప్టెంబర్‌లో మరోసారి 71శాతం నీటివాటా ప్రకారం 763 టీఎంసీలు తెలంగాణకు దక్కుతాయని ప్రకటించారు. ఇటీవల మళ్లీ 953 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ ఎదుట నివేదించినట్టు ప్రకటనలు ఇచ్చారు. నీటివాటాలపై వారికి కనీస అవగాహన లేదనడానికి ఇవే నిదర్శనమని నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్యాయం చేసిందంటూ ఆరోపణలకు దిగడం ఏమిటంటూ విమర్శిస్తున్నారు.
కుట్ర-1
‘ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి జూరాల సోర్స్‌గా ఉమ్మడి ఏపీలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో ఇచ్చారు. కానీ కేసీఆర్ హయాంలో సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంతో నష్టం జరిగింది. కృష్ణా, తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించగానే నీళ్లను ఒడిసిపట్టి ఉంటే బాగుండేది. తద్వారా మనం వదిలాకే ఏపీ వాళ్లు నీళ్లు తీసుకోవాల్సి వచ్చేది. కానీ సోర్స్‌ను శ్రీశైలానికి మార్చడం ద్వారా నీటి దోపిడీకి తెరలేపేందుకు ఏపీకి అవకాశం ఇచ్చింది కేసీఆరే. కృష్ణాజలాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన వెంటనే ఒడిసిపట్టి ఉంటే.. మనం వాడుకున్నాకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాలకు నీళ్లుండేవి’
– ఇవీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇటీవల సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు
కుట్ర-2
జూరాల అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాదు. కేవలం ఒక బరాజ్. పూర్తి సామర్థ్యం 11.94 టీఎంసీలు. ఆ మేరకు నీటిని నింపితే కర్ణాటకలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. కాబట్టి 9 టీఎంసీలకు మించి నిల్వ చేయలేని పరిస్థితి. పూడిక చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సుమారు 6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి. ఫలితంగా ప్రతిపాదిత లక్ష ఎకరాలకు కూడా నీరందించలేక, అప్పుడప్పుడు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారు. జూరాలకు కేవలం కృష్ణా నదీజలాలే ఆధారం. వరద వచ్చినప్పుడే నీటిని ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు జూరాల దిగువన ఉన్నది. కృష్ణా ప్రధాన నదితో, తుంగభద్ర, భీమా నదుల వరద ఈ ప్రాజెక్టులో కలిసి నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, అందులో దాదాపు 160 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉన్నది. డెడ్ స్టోరేజీ వరకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఇలాంటి శ్రీశైలంను కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం జూరాలనే సమర్థిస్తున్నది. శ్రీశైలంపై నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేసింది.
కుట్ర-3
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు కూడా సాగు,తాగునీరు అందించే ప్రతిపాదనలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు నుంచి కొంతభాగాన్ని తొలగించి కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాజెక్టును శ్రీశైలం నుంచి తొలగించి, నీటి లభ్యత లేని జూరాలపైనే ఏర్పాటు చేస్తున్నది. పైగా భీమా ప్రాజెక్టుకు కేటాయించిన 20 టీఎంసీల నుంచి 7.23 టీఎంసీలకు కోతపెట్టి కొడంగల్-నారాయణపేట స్కీమ్‌కు కేటాయించింది. మక్తల్ నియోజకవర్గంలో మరో 50 వేల ఎకరాలనూ జోడించింది. ఇప్పటికే జూరాలపై 5.48 లక్షల ఆయకట్టు భారం ఉండగా, అదనంగా 1.5 లక్షల ఆయకట్టు భారాన్ని మోపుతున్నది.
కుట్ర-4
శ్రీశైలం ప్రాజెక్టుపై ఇప్పటికే ఏపీ పెత్తనం కొనసాగుతున్నది. దీని రక్షణ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లింది. డ్యామ్‌లో చేపల వేటలోనూ ఏపీదే ఆధిపత్యం. ఇప్పటికే కృష్ణా నదిలో తెలంగాణ వాటా నీటిని సరిగా వాడుకోవడమే లేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే వాడుకోవచ్చనే ఆశ ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను పక్కన పడేసింది. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలో ఏపీ ప్రాజెక్టులు తప్ప తెలంగాణకు సంబంధించినవి ఒక్కటి కూడా లేవు.వీటన్నింటిని చూస్తే ఏం అర్థం అవుతున్నది? సాగునీటి రంగ నిపుణులు మాత్రం దీనిని శ్రీశైలాన్ని గంపగుత్తగా ఏపీకి అప్పగించే కుట్రగా విశ్లేషిస్తున్నారు.
అనుమానాలకు ఆధారాలివిగో..
ఆధారం-1
పాలమూరు-రంగారెడ్డి టెండర్లను రేవంత్ సర్కారు రద్దు చేయడం.. పనులు పండబెట్టడం
ఆధారం-2
బాబు పంపిన సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ డైరెక్షన్లో శ్రీశైలం నుంచి వాడే 45 టీఎంసీల కృష్ణా నీటిని వద్దని వదులుకోవడం
ఆధారం-3
పాలమూరు-రంగారెడ్డి కింద ప్రతిపాదించిన 8 లక్షల ఎకరాల ఆయకట్టులో 2 లక్షల ఎకరాలను కొడంగల్ లిఫ్ట్ (జూరాల)కు, 3 లక్షల ఎకరాలను గోదావరి (తమ్మడిహట్టి)కి బదలాయించడం, పాలమూరు ఆయకట్టును కుదించడం
ఆధారం-4
శ్రీశైలంపై ఏపీ అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మించి నీళ్లు తరలించుకుపోతున్నా అడ్డుకోకపోవడం
ఆధారం-5
కృష్ణా నీటిలో మనకు కేటాయించిన వాటా కన్నా గత 4 సీజన్లలోనూ తక్కువ వాడుకోవడం
ఆధారం-6
కృష్ణాపై బాబు ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల మీద చర్చలు, సంప్రదింపులు, సత్సంబంధాలు అని సాగదీయడం
ఆధారం-7
శ్రీశైలం డ్యామ్‌పై ఏపీ ఆధిపత్యాన్నికట్టడి చేయడానికి ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం

(నోట్: 2014 వరకూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిలువరించేందుకు పీఆర్పీకి పోటీగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పీఆర్ఎల్ఐఎస్ స్కీమ్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది)

(నోట్: పోతిరెడ్డిపాడు సామర్థ్యం 11,500 క్యూసెక్కులే. కాంగ్రెస్ హయాంలో వైఎస్ దానిని 44 వేలకు విస్తరించారు. అదనపు లిఫ్టులను, వెలిగొండ ప్రాజెక్టును సైతం చేపట్టారు)
జూరాల మీద ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు
లిఫ్ట్ = రోజుకూ నీటిని ఎత్తిపోసే సామర్థ్యం
జూరాల =4055 క్యూసెక్కులు (గ్రావిటీ)
నెట్టెంపాడు = 3000క్యూసెక్కులు
రాజీవ్ భీమా = 1950క్యూసెక్కులు
కోయిల్‌సాగర్ = 630క్యూసెక్కులు
మొత్తం = 12,835క్యూసెక్కులు (రోజుకు ఒక టీఎంసీ)
(నోట్ః తెలంగాణ ఏర్పాటు నాటికి జూరాల మినహా మరే ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ పూర్తిచేయలేదు)