ఉమ్మడి ఏపీలో గోదావరిపై నిర్మించిన ఒకే ఒక్క భారీ ప్రాజెక్టు శ్రీరాంసాగర్!ఇది ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అంటూ ఉమ్మడి పాలకులు ఊదరగొట్టినా ఆచరణలో దుఃఖదాయిగానే మిగిలిపోయింది. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘చూసుక మురువ.. చెప్పుక ఏడ్వ’ అన్నట్టు! హైదరాబాద్ స్టేట్‌లో ఈ ప్రాజెక్టును 1953లో ప్రతిపాదిస్తే ఆ తర్వాత దశాబ్దానికి 1963లో శిలా ఫలకం పడింది.75 శాతం డిపెండబులిటీపై సుమారు 156 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని గత పాలకులు చెప్పారు. 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించి, 196 టీఎంసీలను వినియోగించుకునేలా రూపకల్పన చేశారు.
1964లో మొదలైన పనులు 2 దశాబ్దాలపాటు కొనసాగాయి. అంచనా వ్యయం రూ.40 కోట్ల నుంచి రూ.15000 కోట్లకు పెరిగింది కానీ సగం ఆయకట్టుకూ నీళ్లందించలేదు. ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి నీటి విడుదల ప్రారంభించేనాటికే ప్రధాన జలాశయం సామర్థ్యం 12 టీఎంసీలు తగ్గింది. కాల్వలన్నీ పూర్తయ్యేసరికి మరో 10 టీఎంసీల సామర్థ్యం తగ్గింది. గడిచిన పదేండ్లలో ఇప్పుడు మరో 10 టీఎంసీలు తగ్గింది. ప్రస్తుతం ఎస్సారెస్పీ నీటినిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయింది. 32 టీఎంసీల నీటినిల్వను కోల్పోయింది. ఇక ఎస్సారెస్పీ స్టేజ్-1లో అంటే ఎల్ఎండీకి ఎగువన అంటే ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ 0-284 కి.మీ వరకు మొత్తంగా 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. అందులో 1/3 తరి, 2/3 మెట్ట పంటలకు నీరిందించేలా ప్రాజెక్టును డిజైన్ చేసినా ఏనాడూ స్జేజ్-1లో మొత్తం ఆయకట్టులో రెండు వంతుల ఆయకట్టుకు కూడా నీళ్లందిన దాఖలాల్లేవు.
ప్రాజెక్టు చరిత్రలో వానకాలం, యాసంగి కలిపినా మొత్తంగా 9 లక్షల ఎకరాలు దాటలేదంటే దాని దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో దిద్దుబాటుకు ఏవైనా చర్యలు చేపట్టారా? అంటే అదీ లేదు. పైగా మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు ఉన్న ఆయకట్టుకే దిక్కులేని ఎస్సారెస్పీని ఆధారంగా చేసుకుకుని మరిన్ని ప్రాజెక్టులు చేపట్టారు. 1984లో ఎస్సారెస్పీ రెండో దశ అంటే కాకతీయ కాలువను 284 కి.మీ నుంచి 347 కి.మీ వరకు విస్తరణ పనులకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. 4.40 లక్షలకు అదనపు ఆయకట్టును చేర్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండు పర్యాయాలు 1996, 2002లో ఈ పనులకూ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి కూడా పనులు పూర్తికాలేదు. పూర్తయిన కాలువలూ నీళ్లివ్వకుండానే శిథిలావస్థకు చేరాయి. ఎస్సారెస్పీ ఆధారంగానే చౌటుపల్లి హన్మంతరెడ్డి ప్రాజెక్టు నిర్మించారు. కాల్వలు సిద్ధమయ్యే సమయానికి ఎగువన మహారాష్ట్ర బాబ్లీ సహా ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టడంతో అసలు జలాశయంలోకి వరద రావడమే తగ్గిపోయింది.
అడపాదడపా వరద వచ్చినా ప్రాజెక్టు కింద ఉన్న 14 లక్షల ఎకరాల్లో సగం ఆయకట్టుకూ నీరందడం గగనమైంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ తీర్చిదిద్దిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు శాశ్వత భరోసా లభించింది. ప్రాజెక్టు ప్రతిపాదిత లక్ష్యాన్ని నెరవేర్చింది. ఎస్సారెస్పీకి తగినంత వరద రానిరోజుల్లో కాళేశ్వరంలో భాగంగా వరద కాల్వ నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించే ప్రాణహిత జలాలను పునర్జీవ పథకం ద్వారా వరద కాల్వ నుంచి రివర్స్ పంపింగ్ చేసి శ్రీరాంసాగర్ జలాశయంలో పోసేలా పథకాన్ని రూపొందించారు. వరద కాల్వను 1.5 టీఎంసీల నీటితో 122 కిలోమీటర్ల పొడవునా రిజర్వాయర్‌గా మార్చారు. వరద కాలువను, ఎస్సారెస్పీ కాకతీయ కాలువను అనుసంధానం చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా నీటిపంపిణీని ఎల్ఎండీ వరకే పరిమితం చేశారు. దిగవ ఆయకట్టుకు వరద కాలువ ద్వారా సప్లిమెంట్ చేశారు. దీంతో శ్రీరాంసాగర్‌పై భారం గణనీయంగా తగ్గింది. ఫలితంగా నేడు ఎస్సారెస్పీ గత లక్ష్యాలను చేరుకోవడమేగాక, కొత్త చరిత్రను లిఖిస్తున్నది. వరదాయిని పేరును సార్థకం చేసుకుంటున్నది.
ఎస్సారెస్పీ మొదటి దశ ఆయకట్టు 9,68,640
(నోట్: 2014-15, 2015-16 సంవత్సరాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆయకట్టుకు నీరివ్వలేదు.)