కవాడిగూడ, నవంబర్ 19: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి కోసం చట్టసభల్లో, వీధుల్లో పోరాటాలు నిర్వహించి, శ్రీరాంసాగర్ రెండో దశ కాలువ నిర్మాణం ద్వారా తాగునీరు అందించేందుకు కృషిచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి (బీఎన్‌రెడ్డి) పేరును కాలువకు నామకరణం చేయాలని, సూర్యాపేటను బీఎన్‌రెడ్డి జిల్లాగా మార్చాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. శ్రీరాంసాగర్ రెండో దశ కాలువకు ఏమాత్రం సంబంధంలేని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరును ప్రకటించడాన్ని తప్పుబట్టారు. అఖిల భారత రైతు సమాఖ్య, వ్యవసాయ కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మట్టయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ముఖ్యఅతిథులుగా ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై బీఎన్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయడంతోపాటు ఐదు ఎకరాలు కేటాయించి ఆయన పేర స్మృతివనాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. రేవంత్ సర్కా ర్.. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుల చరిత్రను కాలరాసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లాసూర్యప్రకాశ్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నాగార్జునరెడ్డి, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, నాయకులతోపాటు బీఎన్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.