1996లో ఓ రోజు శ్రీరాంసాగర్‌కు వచ్చి చూస్తే గేట్లకు గ్రీజు లేదు.. ఆయిలింగ్ లేదు.. సిలుంబట్టినయ్. ప్రాజెక్టు కట్ట మీద ఉండే రోడ్డుపై గజం గజం గుంతలు. ఒక దగ్గర కూలవడ్డం. అప్పుడే నాతోపాటు వచ్చిన మిత్రుడు సత్యనారాయణగౌడ్‌తో ఓ మాట జెప్పిన. ఆంధ్రకు నీరు తీసుకొని పోయే నాగార్జునసాగర్ ప్రాజెక్టేమో.. వైష్ణవ అలయంలా ధగధగలాడుతున్నది. ఇది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి.. ఆయ్యకు వట్టదు.. అవ్వకు వట్టదు. అందుకే శివాలయంలాగా ఉన్నదని ఆరోజు జెప్పిన. అన్యాయం ఎక్కువైన చోట భగవంతుడు కూడా సహించడు. ప్రజలు అసలు సహించరు.. తిరుగుబాటు వస్తది. మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చి తీరుతది అని చెప్పిన. – ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్
గలగలా పరుగులు తీయడమే తెలిసిన గోదావరి.. తెలంగాణలో ఎదురెక్కుతున్నది. చరిత్రను తిరగరాస్తూ తెలంగాణ అంతటా తిరుగుతున్నది. దక్కన్ పీఠభూమి మీద సరికొత్త చరిత్రను జలలిఖితం చేస్తున్నది. ఆ చరిత్రకారుడు కేసీఆర్.
కాళేశ్వరం నుంచి కొండపోచమ్మసాగర్‌కు గోదావరి జలాలు.. అక్కడి నుంచి హల్దీవాగు మీదుగా మంజీరా లోకి, ఆపై గోదావరిలో పున:సంగమం. ఉపనదులు వచ్చి నదుల్లో కలుస్తున్నచోట.. నది వెళ్లి ఉపనదిలో విలీనమవడం ఒక అద్భుతం. ఆ మంత్రదండం కేసీఆర్.
శ్రీరాంసాగర్ నుంచి 122 కిలోమీటర్లు దిగువకు పారి కాళేశ్వరుడి పాదాలు కడిగిన గోదావరిని తిరిగి తోడి తేవడమే పునరుజ్జీవం. లక్ష్మీపూర్ నుంచి 99 కిలోమీటర్లు ఎగువకు మూడు దశల్లో జలాలను ఎత్తి ఎస్సారెస్పీ జీరోపాయింట్‌కు గంగను చేర్చడం ద్వారా నిరంతర జలవలయాన్ని సృష్టించడమే పునరుజ్జీవం. సజీవనదిగా గోదావరిని మార్చిన భగీరథుడు కేసీఆర్.
గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా వట్టిపోయిన గోదావరిది ఓ కన్నీటిగాథ. ఉత్తర తెలంగాణకు వెన్నెముక లాంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమైక్య పాలనలో తాంబాలం లెక్క తయారైంది. పూడిక తీసే దిక్కులేదు. కొత్త కాలువలు తవ్వే నాథుడు లేడు. ఎగువన బాబ్లీ, విష్ణుపురి తదితర ప్రాజెక్టులను కట్టిన మహారాష్ట్ర గోదావరిని గుప్పిట బిగిస్తే.. దిక్కుతోచక విలవిల్లాడింది తెలంగాణ. రాళ్లు తేలిన గోదావరికి జలసత్వాలను ఇచ్చింది కేసీఆర్. కలగని, జలనిధిని ఒడిసిపట్టింది కేసీఆర్. స్వాప్నికుడు, సాధకుడు కేసీఆర్.
కాకతీయ, లక్ష్మి, సరస్వతి కెనాళ్ల ద్వారా నిజామాబాద్ నుంచి ఖమ్మం దాక విస్తరించిన జీవనాడి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. రీడిజైన్ ద్వారా దానికి పూర్వవైభవం కల్పిస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిందే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం. 2017 ఆగస్టు 10న శంకుస్థాపన చేసిన ఈ పథకం 3 పంప్ హౌస్‌ల ద్వారా గోదావరి జలాలను తిరిగి ఎస్సారెస్పీ ఒడికి చేర్చనున్నది. 14లక్షల ఎకరాలకు సాగునీటిని పక్కాగా అందించనున్నది. ఆ జలప్రదాత, భాగ్యవిధాత కేసీఆర్.
ఎస్సారెస్పీ పునరుజ్జీవంపై కరీంనగర్ బ్యూరోచీఫ్ కడపత్రి ప్రకాశ్‌రావు అందిస్తున్న ప్రత్యేక కథనం
రామా! నీళ్లకు ఇదేం గోస..శ్రీరాంసాగర్ కట్ట కింద ఏడ్చిన బతుకులు నాటివి!శంకరా! గంగమ్మ ఎగిరి దుంకుతున్నది చూడు..ప్రాజెక్టు కడుపు నిండా నీళ్లు చూస్తున్న జీవితాలు నేటివి!!
(కడపత్రి ప్రకాశ్‌రావు)
కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి మానస పుత్రికగా పేర్కొంటున్న శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. రూ. 1999.56 కోట్లతో చేపట్టిన ఈ పథకం పనులు ఇప్పటికే పూర్తి కాగా, అతి త్వరలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఇందుకోసం 3 చోట్ల ఏర్పాటు చేసిన పంప్‌హౌస్‌ల పనులు పూర్తి కాగా, అధికారులు ట్రయల్న్‌న్రు కూడా విజయవంతంగా నిర్వహించారు. పునరుజ్జీవ పథకం అమల్లోకి వస్తే ఈ ప్రాజెక్టు పరిధిలోని 13.60 లక్షల ఎకరాలతోపాటు ఉత్తర తెలంగాణలో సుమారు 40 నుంచి 45 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. సాగునీటి రంగ చరిత్రలో ఇదో రికార్డు కానున్నది.
మొదట్లో ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా నిలిచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.. కాల క్రమంలో వట్టిపోయింది. సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురై అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. ఒక దశలో ఎస్సారెస్పీ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితికి చేరుకున్నది. కానీ, స్వరాష్ట్రం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర పాలకులకు భిన్నంగా ఆలోచించారు. గ్రావిటీ ద్వారా లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే ఎస్సారెస్పీ ప్రాజెక్టు వట్టిపోకుండా పునరుజ్జీవం కల్పించాలని ఆలోచించారు. ఆ ఆలోచన ఫలితమే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం. నిజానికి 1963 జూలై 26న ఆనాటి ప్రధాని నెహ్రూ పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 1970 జూలై 24న అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 112 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు 1978లో చెన్నారెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోచంపాడును శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చారు.
శ్రీరాంసాగర్ స్టేజీ-1 కింద పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 9,68,640 ఎకరాలకు సాగునీరు అందించాలని అప్పుడే నిర్ణయించారు. ఇందులో కాకతీయ కెనాల్ జీరో టు 146 కిలోమీటర్ వరకు (ఎల్ఎండీ పై పరిధి) 4,62,920 ఎకరాలకు, 146 నుంచి 284 కిలోమీటర్ వరకు (ఎల్ఎండీ కింది పరిధి) 5,05,720 ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజీ- 2 కింద అంటే 284 నుంచి 346 కిలోమీటర్ పరిధిలో ఉన్న 3,97,949 ఎకరాలకు, మెత్తం స్టేజీ -1, స్టేజీ-2 కలిపి 13,55,589 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు చేశారు. శ్రీరాంసాగర్ ఎగువన ఉన్న గోదావరిపై పలు ప్రాజెక్టులు కట్టడం, వర్షాభావ పరిస్థితులు, సమైక్య ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు తెచ్చాయి.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండా నీళ్లుంటే నిర్దేశిత చివరి ఆయకట్టు వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉన్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. మేధోమథనం చేసి ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.1999.56 కోట్లతో చేపట్టిన ఈ పునర్జీవ పథకానికి 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద శంకుస్థాపన చేశారు. నిజానికి ఇదో అద్భుతమైన ఆలోచన. గతంలో ఏ సాగునీటి రంగ నిపుణులు, ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచనలు చేయలేదు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా పునర్జీవ పథకాన్ని తెరపైకి తెచ్చిన రోజే అద్భుతం అంటూ సాగునీటి రంగ నిపుణులు కితాబిచ్చారు.
కాళేశ్వర జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎత్తిపోసి.. అక్కడి నుంచి సాగునీటి రంగానికి అందించడమే పునరుజ్జీవ పథకం లక్ష్యం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్-1లో లక్ష్మీ బరాజ్ నుంచి ఎల్లంపల్లి వరకు, లింక్-2లో ఎల్లంపల్లి నుంచి నంది మేడారం వరకు.. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద గాయత్రి పంప్‌హౌస్ వరకు నీటిని ఎత్తిపోస్తున్న విష యం తెలిసిందే. గాయత్రి పంప్‌హౌస్ వరకు రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే పంపులు ఏర్పాటు చేసి శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు) నుంచి కొండపోచమ్మ వరకు నీటిని ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్ వద్ద ఎత్తి పోసే కాళేశ్వరం జలాలు వరద కాలువ 99.02 కిలోమీటర్ వద్ద కలుస్తాయి. నిజానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు వరకు మొత్తం వరద కాలువ పొడవు 122 కిలోమీటర్లు. కాగా, కాళేశ్వరం జలాలు వరద కాలువ 99.02 కిలోమీటర్ వద్ద కలుస్తుండగా, అక్కడి నుంచి మూడు పంప్‌హౌస్‌ల ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎత్తిపోయనున్నారు.
నీటిని ఎత్తిపోసేందుకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ (వరద కాలువ 73వ కిలోమీటర్) వద్ద మొదటి పంప్‌హౌస్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్రావుపేట (వరద కాలువ 34 కిలోమీటర్) వద్ద రెండో పంప్‌హౌస్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ (0.10 కిలోమీటర్) వద్ద మూడో పంప్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. పునరుజ్జీవ పథకం కింద రోజుకు ఒక టీఎంసీ చొప్పున రెండు నెలల పాటు 60 టీఎంసీల కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీకి ఎత్తిపోయాలన్నది ప్రధాన లక్ష్యం. ఇందుకోసం మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోసేందుకు ప్రతి పంప్‌హౌస్‌లో 8 మోటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మోటర్ సామర్థ్యం 6.5 మెగావాట్లు కాగా, ఒక్క పంప్‌హౌస్‌లో 8 మోటర్ల సామర్థ్యం కలిపి 52 మెగావాట్లు అవుతుంది.
అలా మూడు పంప్‌హౌస్‌ల్లో కలిపి మొత్తం 156 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లు ఏర్పాటు చేశారు. గాయత్రి పంప్‌హౌస్ ద్వారా కాళేశ్వరం జలాలు ముందు గా వరద కాలువ 99.02 కిలోమీటర్ వద్ద కలుస్తుండగా, వరద కాలువ 102 కిలోమీటర్ వద్ద హెడ్ రెగ్యులేటర్‌కు గేట్లు బిగించారు. గాయత్రి పంప్‌హౌస్ నుంచి వచ్చే గోదావరి జలాలు.. హెడ్ రెగ్యులేటర్ గేట్లు తెరిస్తే దిగువన ఉన్న శ్రీరాజరాజేశ్వర జలాశయానికి వస్తాయి. మూసివేస్తే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎత్తిపోయవచ్చు. అలా కాకుండా, గాయత్రి పంప్‌హౌస్ నుంచి రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసే పరిస్థితి వచ్చినప్పుడు శ్రీరాజరాజేశ్వర జలాశయానికి ఒక టీఎంసీ, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం కింద ఒక టీఎంసీ నీరు తీసుకునేలా గేట్లు ఏర్పాటు చేశారు. పునరుజ్జీవంలో భాగంగా ముందుగా రాంపూర్ పంప్‌హౌస్ నుంచి రాజేశ్వర్‌రావుపేటకు, ఆ తర్వాత అక్కడి నుంచి ముప్కాల్‌కు, ముప్కాల్ పంపు నుంచి ఎస్పారెస్పీకి నీటిని ఎత్తిపోస్తారు. దీని ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలోని 13.60 లక్షల ఎకరాలకు నీరు లభించటంతోపాటు, మిగిలిన అన్ని మార్గాలను కలుపుకొని ఉత్తర తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు పైగా భూములు సస్యశామలం కానున్నాయి.
పునరుజ్జీవం ద్వారా ఎస్సారెస్పీని నింపడమేకాదు.. 122 కిలోమీటర్ల పొడవునా వరద కాలువ నిండుకుండలా ఉంటుంది. వరద కాలువ 102 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన గేటు నుంచి 73 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన రాంపూర్ పంప్‌హౌస్ గేటు వరకు అర టీఎంసీ నీరు కాలువలో ఉంటుంది. తదుపరి రాంపూర్ పంప్‌హౌస్ 73 కిలోమీటర్ వద్ద ఎత్తిపోసే నీరు అక్కడి నుంచి 34 కిలోమీటర్ వద్ద ఏర్పాటుచేసిన రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్ గేట్ల వరకు అర టీఎంసీ నీరు ఉంటుంది. అలాగే, 34 కిలోమీటర్ నుంచి 0.10 కిలోమీటర్ ముప్కాల్ వద్ద ఏర్పాటు చేసిన పంప్‌హౌస్ వరకు మరో అర టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. మొత్తం మూడు చోట్ల కలిపి చూస్తే వరద కాలువ 102 కిలోమీటర్ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 0.10 కిలోమీటర్ వరదకాలువ వరకు ఒకటిన్నర టీఎంసీల నీరు వరద కాలువలో ఉంటుంది. ఇప్పటికే వరద కాలువకు 34 తూములను ఏర్పాటుచేసి 70 నుంచి 80 చెరువులను నింపుతున్నారు.
2017 ఆగస్టు 10న శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 20 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. పునరుజ్జీవ పథకం ద్వారా సమకూరే ప్రయోజనాలను వివరించడంతోపాటు భవిష్యత్తులో ఎలా జీవధారగా మారుతుందో వివరించారు.
2001 గులాబీ జెండా ఎగిరినంక జలసాధన ఉద్యమం చేసినం. అప్పుడు నేను మాట్లాడిన క్యాసెట్లో ఇచ్చంపల్లిని ఇచ్ఛకాయల పాలుజేసిండ్రు. నిజాంసాగర్ వట్టిపోయింది. మెదక్ జిల్లా గణపురం నాశనమైంది. అప్పర్ మానేరు అడుగంటింది.. డిండిలో బండలు తేలినయి.. కోయిలసాగర్ను కొంగలెత్తుకొని పోయినయి.. చెరువలన్నీ తాంబాలాలై నాశనమై పోయినయని జెప్పిన.
తెలంగాణ వచ్చే నాటికి మన పరిస్థితి చూస్తే తెలంగాణకు ఇచ్చినం.. తెలంగాణకు చేస్తాం.. అని జెప్పినవన్నీ మోసపూరిత మాటలే. నీళ్లు వచ్చేవి కావు.. తెచ్చిందీ లేదు. నీళ్లు ఇచ్చేందుకు మొదలుపెట్టిన ప్రాజెక్టులూ కావు. ఇప్పుడు గోదావరి, కృష్ణ నదుల నుంచి నీళ్లను ఎట్లా తీసుకోవాలో ఆలోచించి ముందుకు వెళ్తున్నం.
1996లో నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఉపఎన్నిక జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్న వేణుగోపాలచారి రాజీనామా చేస్తే ఆయనను గెలిపించడానికి నేను నిర్మల్‌కు వచ్చా. కొంత సమయం దొరికితే ఓ రోజు మన ప్రాజెక్టు కదా! అని శ్రీరాంసాగర్‌ను చూసేందుకు కట్ట మీదకు వచ్చినం. వచ్చి చూస్తే గేట్లకు గ్రీస్ లేదు.. ఆయిలింగ్ లేదు.. సిలుంబట్టినయ్. ప్రాజెక్టు కట్ట మీద ఉండే రోడ్డుపై గజం గజం గుంతలు. ఒక దగ్గర కూలవడ్డం. అప్పుడే నాతో వచ్చిన మిత్రులతో నేను ఓ మాట జెప్పిన. ఆంధ్రకు నీరు తీసుకొని పోయే నాగార్జునసాగర్ ప్రాజెక్టేమో.. వైష్ణవ అలయంలా ధగధగలాడుతున్నది. ఇది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి.. శివాలయంలాగా ఉన్నదని జెప్పిన. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నన్ని రోజులు ఎవ్వరం ఏమీ జేయలేం.. మన ఖర్మ ఇంతే అని జెప్పిన.. అన్యాయం ఎక్కువైన చోట తిరుగుబాటు వస్తది. మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చి తీరుతది అని చెప్పిన. నేను బతికే ఉంటే నా ఆరోగ్యం సహకరిస్తే.. ఈసారి తెలంగాణ ఉద్యమం నేనే మొదలుపెడ్తా, చివరి దాకా కొట్లాడుతా అని ఆ రోజే జెప్పిన. ఇదే శ్రీరాంసాగర్ కట్ట మీద 1996లో స్వయంగా నేనే చెప్పిన.
ఈ రోజు నిజంగా నాలాంటి అదృష్ణవంతులు చాలా తక్కువ మంది ఉంటరు. 1996లో ఏ శ్రీరాంసాగర్ కట్ట మీద నేను ఉద్యమం చేస్తా.. తెలంగాణ సాధిస్తా.. తెలంగాణకు న్యాయం జేస్తా.. అని జెప్పిన్నో అదే మాట ప్రకారం తెలంగాణ సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవం పథకానికి ఫౌండేషన్ వేసేందుకు వచ్చిన. నా జన్మధన్యమైందనిజెప్తున్న. ఆంధ్రా వాళ్లు మనకు నీళ్లు ఇవ్వాలని ఏ ప్రాజెక్టు పెట్టలే. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుది అదే పరిస్థితి. ఎస్సారెస్పీతో 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని జెపితే.. ఎన్నడూ ఐదున్నర లక్షల ఎకరాలు దాటలే. కొత్త కాల్వలకు పోలే.
ఈరోజు ఎస్సారెస్పీ కట్టకిందనే ఉన్నం. ఇంతకుముందే ఫౌండేషన్‌కు కట్ట మీది నుంచే పోయిన. 8 టీఎంసీల నీళ్లు మాత్రమే ప్రాజెక్టులో ఉన్నయి. ఈ సంవత్సరం ఒక్క చుక్క నీరు రాలే. ఇదే పరిస్థితి ఉంటే మన గతి ఏమి కావాలె? దానికోసమే ఇవ్వాళ ఆలోచన జేసి అతి తక్కువ సమయంలో నీళ్లు తెచ్చే కార్యక్రమం జేస్తున్నం. ఇక్కడ ఉన్నది గోదావరే.. కాళేశ్వరం వద్ద ఉన్నది గోదావరే. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేసి అక్కడి నుంచి వరద కాలువలో నీరు పోసి అక్కడి నుంచి శ్రీరాంసాగర్‌ను నింపే కార్యక్రమం జేస్తున్నం. శ్రీరాంసాగర్‌లో 8 టీఎంసీలు పాత నీళ్లు ఉంటే.. ఒక్క టీఎంసీ కొత్త నీరు రాలే. కానీ, కాళేశ్వరం దగ్గర అంటే ఎక్కడి నుంచే అయితే ఎస్సారెస్పీ నింపుదామనుకుంటున్నమో.. అక్కడ మట్టుకు జూన్‌లో వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు.. 250 టీఎంసీల నీళ్లు గంగలో కలిసిపోయినయ్. సముద్రం పాలైనయ్.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బ్రహ్మాండమైన పద్ధతిలో 40 నుంచి 45 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేలా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేలా మడమ తిప్పకుండా పోరాటం చేసి ముందుకుపోతాం. మేడిగడ్డ, సుందిళ్ల అన్నారం బరాజ్‌లు పూర్తయితే.. ఏటా ఫిబ్రవరి, మార్చి నాటికే మొత్తం 90 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీలో నింపి పెట్టుకుంటం. మొగులుకు ముఖం చూసే అవసరం ఉండదు. ఒక్కసారి ఎస్సారెస్పీ నింపుకున్నామంటే నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, తదితర జిల్లాల రైతులకు రెండు పంటలు పండించుకునే అవకాశం ఏర్పడుతుంది. బాల్కొండ, మెట్పల్లి, వేములవాడ, మానకొండూరు, తదితర ప్రాంతాలను ఆనుకొని పోయే వరద కాలువ 110 కిలోమీటర్ల దూరం 365 రోజులు నిండే ఉంటుంది.