హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భూముల ధరలు భారీగా పడిపోయాయని హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడకముందు 2 లక్షలకు ఎకరం పలికిన భూమి కేసీఆర్ పాలనలో కోటి రూపాయల వరకు చేరిందని, మళ్లీ ఇప్పుడు 70 లక్షలకు కూడా ఎవరూ అడగడం లేదని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో మాట్లాడిన శ్రీనివాస్ తన అనుభవాన్ని పంచుకున్నారు. తెలంగాణలో సకల జనులు సమస్యల్లో చిక్కుకున్నారని వాపోయారు.
నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. మా పెద్దపాపను యాదగిరిగుట్ట దగ్గర గౌరాయపల్లికి ఇచ్చినం. రాష్ట్రం రాక ముందు అక్కడ ఎకరం రూ.2 లక్షలుండె. తెలంగాణ వచ్చినంక కోటి రూపాయలైంది. యాదగిరిగుట్టకు కేసీఆర్ వచ్చిపోయిన ప్రతీసారి ఎకరం భూమి విలువ రూ.5 లక్షల చొప్పున పెరిగింది. కోటి రూపాయల దాక ధరవచ్చింది. నా బిడ్డ కోటీశ్వరురాలైందని మస్తు సంబురపడ్డం. కాంగ్రెస్ వచ్చినంక ధర దారుణంగా పడిపోయింది. 30 లక్షలు తగ్గిపోయింది.
ఎకరం 70 లక్షలకు అమ్ముదామన్నా కొనేనాథుడే లేడు. చిన్నబిడ్డను గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చినం. తెలంగాణ రాష్ట్రం రాకముందు అల్లుడి జీతం 30 వేలుంటే కేసీఆర్ సారు పుణ్యాన అది డబుల్ అయ్యింది. అప్పట్ల ఏక్ధమ్ రూ.60 వేలయ్యింది. మా హమాలీ కూలీలు కూడా కేసీఆర్ పెంచిండు. 5లక్షల బీమాతో ధీమా ఇచ్చిండు. కార్మికులను కడపుల పెట్టి చూసుకున్న కేసీఆర్ని జనం ఆశకు పోయి ఒడగొట్టుకున్నరు. ఇయ్యాల కేసీఆర్ను దూరం చేసుకున్నందుకు బాధపడని గుండె లేదు. కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు అందరూ గోస పడుతున్నరు’ అని శ్రీనివాస్ చెప్పారు.