మషీరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఎస్సీ రిజర్వుడు అయిన మూడు ఎంపీ స్థానాల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇవ్వనందుకు నిరసనగా గాంధీభవన్, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలు, ఆ పార్టీ అభ్యర్థుల ఇండ్ల ముందు చావుడప్పు కొట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ పిలుపునిచ్చారు. మాదిగలపై సీఎం రేవంత్‌కు ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే అభ్యర్థులను మార్చి మాదిగ అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బుధవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీల్లో నూటికి 70శాతం మంది ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి గుంటనక్క లెక్క మాలమాదిగలను వంచిస్తూ మోసం చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారని గతంలో విమర్శించిన రేవంత్ అదే కడియంను నేడు పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ, మాదిగ దండోరా ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని కడియం కావ్యకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన శ్రీనివాస్‌మాదిగ అసలు కావ్యకు తెలంగాణతో సంబంధమే లేదని తెలిపారు. ఆంధ్రావ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెకు టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. మాదిగలపై శ్రీహరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా తన బిడ్డను పోటీనుంచి తప్పించాలని, లేదంటే ఆయన ఇంటిముందు కూడా చావుడప్పు మోగిస్తామని తెలిపారు.
మాదిగలను విస్మరించిన చంద్రబాబుకు పట్టిన గతే భవిష్యత్తులో రేవంత్‌కు పడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ అంటే తనకు గౌరవమన్న కడియం కష్టకాలంలో ఆయన వెంట ఎందుకు నిలవలేకపోయారని నిలదీశారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య నుంచి ఆ పదవిని లాక్కున్నారని విమర్శించారు. తన బిడ్డకు తొలుత బీఆర్ఎస్ టికెట్ ఇప్పించుకుని ఆ తర్వాత పార్టీ మారి బీఆర్ఎస్కు ద్రోహం చేశారని శ్రీనివాస్‌మాదిగ దుయ్యబట్టారు.