హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ‘కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు జూరాల పోటెత్తుతున్నా రేవంత్ సర్కారుకు నీళ్లు తరలించాలనే సోయిలేదు. అల్మట్టి, తుంగభద్ర ద్వారా వస్తున్న నీళ్లను వాడుకోవాలనే శ్రద్ధలేదు. వెరసి, ఈ ప్రభుత్వానికి వ్యవసాయంపై పట్టింపులేదు. రైతులకు మేలు చేయాలన్న తలంపులేదు’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నదులకు వరదలు వచ్చినప్పుడు కరువు పీడిత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ప్రాజెక్టులను నింపేదని, కానీ, ప్రస్తుత సర్కారు మాత్రం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. జూరాలపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు నీళ్లు తరలించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. సరైన ప్రణాళికలు లేక వృథాగా పోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
యాసంగిలో నీళ్లులేవని పంటలు ఎండబెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎగువనుంచి వరద జలాలను వృథా చేస్తూ వానకాలంలోనూ పంటలు పండించలేని దుస్థితికి నెడుతున్నదని శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. సంగంబండకు మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు నింపుకొనే పరిస్థితిలేదని, పాలమూరు ప్రాజెక్టులో మోటర్లు సిద్ధంగా ఉన్నా ఎత్తిపోయాలనే ధ్యాసలేదని విమర్శించారు. దేవుడు కరుణించినా పూజారి కరుణించని చందంగా ఎగువనుంచి వరద వస్తున్నా ఈ సర్కారుకు ఒడిసిపట్టుకొనే సోయి కరువైందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌కు 6 నెలల్లో పాలమూరు నీళ్లందిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్.. ఏడాదిన్నరైనా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో అన్ని హంగులతో నిర్మించిన రైతు వేదికలను సద్వినియోగం చేసుకొనేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. అక్కడి సౌకర్యాలను వినియోగించుకొని రైతాంగానికి మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల గేట్లకు తక్షణమే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.