మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 17 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జీవో ప్రకారం రిజర్వేషన్లు సాధ్యం కాదని బీఆర్ఎస్ చెప్పినా ప్రభుత్వం వినలేదని, అదే నేడు నిజమైందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులను బయటకు తీయొద్దని సూచించారు. విద్య, వ్యాపార సంస్థలు బంద్‌లో పాల్గొని సహకరించాలని కోరారు.