హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేల చొప్పున భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆచరణలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. రెండున్నరేండ్లుగా సంక్షేమ బోర్డు ఊసే ఎత్తడంలేదని ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి, ఆటో డ్రైవర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారయ్య ఆధ్వర్యంలో యూనియన్ ముఖ్యనేతలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఆటోడ్రైవర్ల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశామని, రవాణా పన్ను రద్దు చేశామని గుర్తుచేశారు. ఓట్ల కోసం అలవిగాని హామీలు గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆటోడ్రైవర్లను మోసం చేసిందని విమర్శించారు.
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావుకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన హరీశ్‌రావు బీఆర్ఎస్ తరుఫున అండగా ఉంటామన్నారు.