Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్‌నగర్‌కు జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిన్న మంత్రి, ముఖ్యమంత్రి మాటలకు ప్రజల నుంచి స్పందన లేదని తెలిపారు. ఇప్పటికైనా చిల్లర మాటలను సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవుపలికారు. పాత చింతకాయ పచ్చడిలా రేవంత్ రెడ్డి ప్రసంగం ఉందని ఎద్దేవా చేశారు.
మహబూబ్‌నగర్‌లో శనివారం ఉదయం మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పర్యటన గురించి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఆశతో ఎదురుచూశారని తెలిపారు. కానీ ఉమ్మడి జిల్లా ప్రజలకు సీఎం ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కట్టిన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను పరిశీలించిన వెళ్లారని తెలిపారు. కర్ణాటక జల దోపిడీకి మనం నిధులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టును సీఎం ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు.
తెలంగాణ నీటిని ఆంధ్రాకు దోచిపెట్టే కుట్రలు జరుగుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆంధ్రా వ్యక్తిని సాగునీటి సలహాదారుగా పెట్టి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏపీకి నీళ్లు తీసుకుపోయి పాలమూరును ఎండబెడతారంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెండర్లు పిలిచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జూరాలకు చుక్కనీరు వస్తలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను పడావు పెడుతున్నదని విమర్శించారు. కర్ణాటకలో చర్చలు కొలిక్కి రాకుండానే బ్యారేజి కమ్ బరాజ్‌లపై ఎలా ఏరియల్ సర్వే చేశారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్వోసీ ఇస్తే బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తానని అంటున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ జల హక్కులపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు తిరిగే రిజర్వాయర్లు కట్టింది కేసీఆర్ కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి తట్టెడు మట్టిని కూడా రేవంత్ ప్రభుత్వం తీయలేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేసింది 45 కిలోమీటర్ల కాలువలు అని.. అందులో41 కిలోమీటర్ల కాలువలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. మొత్తం రూ.33,500కోట్ల పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను కాంగ్రెస్ చేసిందని చెప్పుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి పనుల జాప్యానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని అన్నారు.