హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. అందులో భాగంగానే రాష్ట్రలో మద్యం ధరలను పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టిందని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. మద్యం ధరలు పెంచితే రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆదాయ పెంపుకోసం కొత్తగా 604 మద్యం బ్రాండ్లకు అనుమతించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంతో అక్కడి ప్రజలు నాసిరకం మద్యం తాగి మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు.
అలాంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో రావాలని సర్కారు కోరుకుంటుందా? అని ప్రశ్నించారు. మద్యం ధరలు 10 శాతం పెంచినా.. సామాన్యులపై పెనుభారం పడుతుందని మండిపడ్డారు. ప్రస్తుతం మద్యం విక్రయాల వల్ల రాష్ర్టానికి రూ.36,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని, మద్యం ధరలు పెంచితే ఆ ఆదాయాన్ని రూ.50,000 కోట్లకు తీసుకెళ్లాలని భావిస్తున్నారా? అని నిలదీశారు. టెట్రా ప్యాక్ మద్యం విధానం అమల్లోకి వస్తే, దాని ప్రభావం పిల్లలపై పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫ్రూటీ తాగినట్లుగా పిల్లలు టెట్రా మద్యాన్ని కూడా తాగుతారంటూ తెలిపారు. విచ్చల విడిగా మద్యం వినియోగం పెరిగే ప్రమాదం ఉన్నదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో నకిలీ మద్యం కట్టడి
బీఆర్ఎస్ హయాంలో నకిలీ మద్యాన్ని కట్టడి చేశామని చెప్పారు. ఆనాడే టెట్రా ప్యాక్ మద్యం ప్రతిపాదనలు వస్తే.. వాటిని ఆనాటి సీఎం కేసీఆర్ నిర్ధ్వందంగా తోసిపుచ్చారని గుర్తుచేశారు. బార్షాపుల సంఖ్యను విపరీతంగా పెంచుతున్నారని దుయ్యబట్టారు. మిగతా రంగాల్లో ఆదాయం తగ్గుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, మద్యంద్వారానే ఆదాయం పెంచుకోవాలన్న దురాలోచన ఎందుకు చేస్తున్నదని ప్రశ్నించారు. అడ్డమైన కంపెనీ బ్రాండ్లతో ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.